
హైదరాబాద్ మెట్రోపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రో నిర్వహణ కోసం ప్రత్యేక కార్పొరేషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. మెట్రో పనులు, నిర్వహణ, ఉద్యోగుల భర్తీ, జీతాలు లాంటి విషయాలన్నీ ఈ కార్పొరేషన్ చూసుకోనుంది. ఈ కార్పొరేషన్‌కు స్వయం ప్రతిపత్తి హోదా కల్పించనున్నారు. ఢిల్లీ మెట్రో మోడల్ తరహాలోనే హైదరాబాద్ మెట్రో రానున్న రోజుల్లో కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరగనుంది. మెట్రో నెట్‌వర్క్‌ను 400 కిలోమీటర్ల మేర విస్తరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇందుకోసం ఇప్పటికే కసరత్తులు చేస్తోంది. మెట్రో సెకండ్ ఫేజ్‌కు భారీగా నిధులు సమకూర్చుకుంటోంది. కేంద్రం, రాష్ట్రం కలిపి 50-50 జాయింట్ వెంచర్ కింద చేపట్టలని కేంద్రానికి రాష్ట్ర సర్కార్ ఇప్పటికే ప్రతిపాదనలు పంపింన విషయం తెలిసిందే. రెండో దశకు కేంద్రం నుంచి అనుమతులు రాగా.. నిధులు ఇంకా కేటాయించలేదు.
8 కారిడార్ల మెట్రో డీపీఆర్‌ను కేంద్రానికి తెలంగాణ సర్కార్ పంపింది. ప్రస్తుతం ఎల్‌అండ్‌టీ సంస్థ మెట్రో బాధ్యతలను నిర్వహిస్తోంది. అయితే ఈ సంస్థకు మెట్రో నిర్వహణ కష్టంగా మారింది. నష్టాల బాటలో నడుస్తుండటంతో ఎల్‌అండ్‌టీ సంస్థ నడిపేందుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో మెట్రో బాధ్యతల నుంచి తప్పుకుంటామని గతంలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. దీనిపై చర్చించిన రేవంత్ సర్కార్.. ఎల్‌అండ్‌టీ సంస్థ నుంచి మెట్రోను టేకోవర్ చేసుకోవాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతుండగా.. వచ్చే ఏడాది ఫిబ్రవరిలోపు మెట్రోను ఎల్‌అండ్‌టీ నుంచి స్వాధీనం చేసుకోనుంది. ఈ క్రమంలో మెట్రో నిర్వహణ కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇక నుంచి ఈ కార్పొరేషన్ మెట్రో నిర్వహణలో కీలకంగా మారనుంది. ఆర్టీసీకి ఎలా అయితే ప్రత్యేక సంస్థగా ఉందో.. మెట్రోకు కూడా అలాగే ఉండనుందని చెప్పవచ్చు. నిధులు సమీకరణ, కేటాయింపు, ఖర్చు అన్నీ కార్పొరేషన్ చూసుకోనుంది.
ఇక ఎల్‌అండ్‌టీ సంస్థ నుంచి మెట్రోను టోకేవర్ చేసుకుంటున్న తరుణంలో ఆ సంస్థ ఆధీనంలో ఉన్న భూములు, ఇతర ఆస్తులను లీగల్‌గా అసెస్‌మెంట్ చేసేందుకు ఐడీబీఐ కన్సల్టెన్సీకి ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. ఇక టెక్నికల్ అసెస్‌మెంట్ కోసం మరో సంస్థకు నియమించుకోనుండగా.. ఫిబ్రవరిలో లోపు ఈ పనులన్నీ పూర్తి చేయలని ఆదేశించింది. చివరిగా మార్చి వరకు స్వాధీన ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం డెడ్‌లైన్ పెట్టుకుంది