Hyderabad Metro: హైదరాబాద్ ప్రజలకు శుభవార్త.. మెట్రో విస్తరణపై బిగ్ అప్డేట్ వచ్చేసింది.. ఈ రూట్‌లో కొత్త ప్లాన్..

హైదరాబాద్ మెట్రో విస్తరణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. నగరం నలుమూలకు ఈ సేవలు అందించాలనే ఉద్దేశంతో ముందుకెళ్తుంది. ఇందుకోసం ఓఆర్ఆర్ చుట్టుపక్కల మెట్రో రింగ్ లైల్ ప్రాజెక్ట్ చేపట్టనుంది. ఈ విషయాన్ని అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. ఆ వివరాలు ఇలా..

Hyderabad Metro: హైదరాబాద్ ప్రజలకు శుభవార్త.. మెట్రో విస్తరణపై బిగ్ అప్డేట్ వచ్చేసింది.. ఈ రూట్‌లో కొత్త ప్లాన్..
Hyderabad Metro

Updated on: Jan 04, 2026 | 12:35 PM

హైదరాబాద్‌లో మెట్రో విస్తరణకు శరవేగంగా అడుగులు పడుతున్నాయి. తెలంగాణ రైజింగ్ విజన్‌లో భాగంగా నగరం నలుమూలలకు మెట్రో సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. శివారు ప్రాంతాల వరకు కూడా మెట్రో నిర్మించేందుకు కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా ఓఆర్ఆర్ చుట్టూ మెట్రో సేవలు తీసుకురావాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. ఇది పూర్తైతే నగరం నలుమూలల నుంచి జనం సులువుగా సిటీ నడిబొడ్డుకు చేరుకోవచ్చు. ట్రాఫిక్ తగ్గడంతో పాటు వేగవంతంగా నగరంలోకి చేరుకోవచ్చు.

 360 డిగ్రీల కోణంలో మెట్రో

ఆర్ఆర్ఆర్ చుట్టపక్కల 360 డిగ్రీల కోణంలో మెట్రో రింగ్ రైలు ప్రాజెక్ట్ చేపట్టనున్నారు. ఈ విషయాన్ని అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ డీపీఆర్ రెడీ అవుతోంది. ఇందులో భాగంగా ఓఆర్ఆర్‌పై 22 ఇంటర్‌ఛేంజ్‌ల వద్ద మెట్రో స్టేషన్లు నిర్మించనున్నారు. ఇక్కడ ప్రజల కోసం స్కైవాక్‌లు నిర్మిస్తారు. ఇక రైల్వే స్టేషన్‌తో కూడా ఈ మెట్రో లైన్‌ను కనెక్ట్ చేస్తారు. ఇక ప్రతీ మెట్రో స్టేషన్‌లో వెహికల్స్ పార్కింగ్ కోసం ఎక్కువ స్థలం కేటాయిస్తారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారు ఇక్కడే వెహికల్స్‌ను పార్క్ చేసి మెట్రో ద్వారా నగరం లోపలికి చేరుకోవచ్చు. దీని వల్ల ట్రాఫిక్ భారీగా తగ్గుతుంది. ఓఆర్ఆర్ నుంచి వచ్చే వెహికల్స్ వల్ల ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతుంది. దీనికి అడ్డుకట్ట వేస్తే నగరంలో ట్రాఫిక్ తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు.

మెట్రో ప్రత్యేక కార్పొరేషన్

త్వరలో మెట్రోను ఎల్అండ్‌టీ నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుంది. దీంతో పాటు మెట్రో నిర్వహణ కోసం టీజీఎస్‌ఆర్టీసీ తరహాలోనే ఓ కార్పొరేషన్ ఏర్పాటు చేయనుంది. మెట్రో నిర్వహణ, విస్తరణ, ఇతర పనులు ఈ కార్పొరేషన్ ఆధ్వర్యంలోనే జరగనున్నాయి. ఢిల్లీలో ఇప్పటికే మెట్రో కార్పొరేషన్ ఉంది. అదే రీతిలో హైదరాబాద్ మెట్రో కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్పొరేషన్‌కు ఛైర్మన్‌ను కూడా నియమించనుంది.