Telangana: అడ్రస్ చేయాల్సిన ఇష్యూ.. చైల్డ్ ట్రాఫికింగ్‌లో తెలంగాణనే టాప్

దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన చైల్డ్ ట్రాఫికింగ్ కేసుల్లో తెలంగాణ కేంద్రంగా పనిచేస్తున్న ముఠాలు కీలకంగా ఉన్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ ఏడాది తెలంగాణలోనే 7 ప్రధాన చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాలను ఛేదించి 90 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

Telangana: అడ్రస్ చేయాల్సిన ఇష్యూ.. చైల్డ్ ట్రాఫికింగ్‌లో తెలంగాణనే టాప్
Telangana Child Trafficking

Edited By:

Updated on: Dec 25, 2025 | 12:15 PM

దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాల్లో తెలంగాణ పేరు టాప్‌లో నిలుస్తోంది. తెలంగాణ కేంద్రంగా పనిచేస్తున్న ముఠాలే కాకుండా, గుజరాత్, ముంబై వంటి ఇతర రాష్ట్రాల్లో నమోదైన చైల్డ్ ట్రాఫికింగ్ కేసుల్లోనూ తెలంగాణకు చెందినవారు నిందితులుగా తేలడం సంచలనంగా మారింది. ఈ ఏడాది ఒక్క తెలంగాణలోనే 7 మేజర్ చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాలను పోలీసులు చేధించారు. ఈ కేసుల్లో మొత్తం 90 మందిని నిందితులుగా అరెస్టు చేయడం ద్వారా పోలీసులు కీలక పురోగతి సాధించారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాలు ఈ అక్రమ దందాకు కేంద్రాలుగా మారినట్టు దర్యాప్తులో తేలింది.

చైతన్యపురి, గోపాలపురం, మేడిపల్లి, పేట్ బషీరాబాద్, చందానగర్, మియాపూర్, కరీంనగర్, సూర్యాపేట వంటి ప్రాంతాల్లో చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాలపై కేసులు నమోదు అయ్యాయి. నగర శివారు ప్రాంతాల నుంచే కాదు, జిల్లా కేంద్రాల వరకూ ఈ ముఠాల నెట్‌వర్క్ విస్తరించి ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల సంచలనం సృష్టించిన సృస్టి కేసులో 27 మందిని పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా మియాపూర్‌లో వెలుగుచూసిన మరో చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. చైతన్యపురి, మేడిపల్లి కేసుల్లో మొత్తం 19 మంది నిందితులను అరెస్టు చేయడం ద్వారా ముఠాల వెనుక ఉన్న బలమైన లింకులు బయటపడ్డాయి.

పోలీసుల దర్యాప్తులో బయటపడుతున్న వివరాలు మరింత షాకింగ్‌గా ఉన్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి చిన్నారులను తీసుకొచ్చి ప్రైవేట్ హాస్పిటళ్లలో అక్రమంగా విక్రయిస్తున్న ముఠాలు పనిచేస్తున్నట్టు తేలింది. ఆర్థిక ఇబ్బందులతో ఉన్న తల్లిదండ్రులను తక్కువ డబ్బుకు ప్రలోభపెట్టి, శిశువులను బస్సుల్లో తరలిస్తున్న ఏజెంట్ల పాత్ర కీలకంగా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఇక మరోవైపు IVF సెంటర్లను ఆశ్రయిస్తున్న దంపతుల వివరాలు సేకరించి, వారికి పిల్లలు ఇప్పిస్తామని చెప్పి ట్రాప్ చేస్తున్న ఏజెంట్ల వ్యవహారం కూడా వెలుగులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా చాప కింద నీరులా విస్తరిస్తున్న ఈ చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాలపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. చిన్నారుల భవితను చిదిమేస్తున్న ఈ ముఠాలపై యుద్ధప్రాతిపదికన చర్యలు కొనసాగుతాయని తెలంగాణ పోలీసులు స్పష్టం చేస్తున్నారు.

ఈ కేసుల్లో హాస్పిటల్ సిబ్బంది, మధ్యవర్తులు, నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసే వ్యక్తులు కలిసి పనిచేస్తున్నట్టు దర్యాప్తులో వెల్లడైంది. పుట్టిన శిశువుల వివరాలను మార్చడం, తల్లిదండ్రుల వివరాల్లో తేడాలు చూపించడం, ఫేక్ జనన ధ్రువపత్రాల ద్వారా పిల్లలను అప్పగించడం వంటి పద్ధతులు ముఠాలు వినియోగిస్తున్నాయని పోలీసులు గుర్తించారు. ఈ అక్రమ వ్యాపారంలో కోట్ల రూపాయలు చేతులు మారుతున్నట్టు ప్రాథమిక అంచనాలు చెబుతున్నాయి.

చైల్డ్ ట్రాఫికింగ్‌ను పూర్తిగా అరికట్టేందుకు స్పెషల్ టీమ్స్‌ను రంగంలోకి దింపినట్టు పోలీసులు తెలిపారు. ఇతర రాష్ట్రాల పోలీసులతో సమన్వయం పెంచుతూ, హాస్పిటళ్లు, IVF సెంటర్లు, బస్సు రూట్లు, మధ్యవర్తులపై నిరంతర నిఘా కొనసాగుతోంది. చిన్నారుల అక్రమ రవాణా కేసుల్లో ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని, బాధ్యులపై కఠిన చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలంగాణ పోలీసులు స్పష్టంగా హెచ్చరిస్తున్నారు.