తెలంగాణలో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఎస్ఈ తరహాలోనే రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను రద్దు చేసింది. అలాగే ఇంటర్ పరీక్షలను వాయిదా వేసింది. కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
కాగా, రాష్ట్రంలో దాదాపు 5.35 లక్షల మంది పదో తరగతి విద్యార్ధులు ఉండగా.. వీరందరినీ కూడా పైతరగతులకు ప్రమోట్ చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయానికి సంబంధించిన ప్రతిపాదనను విద్యాశాఖ సీఎం కేసీఆర్‌కు పంపగా.. ఆ ఫైల్‌పై ముఖ్యమంత్రి ఆమోదముద్ర వేశారు. కాగా, ఇప్పటికే కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో విద్యాసంస్థలను మూసివేసిన సంగతి విదితమే. అటు ఇంటర్ ప్రాక్టికల్స్ మే 29 నుంచి జూన్ 7 వరకు ఉంటాయని ఇప్పటికే ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఇదిలా ఉంటే ఇంటర్ పరీక్షల నిర్వహణపై కూడా రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది.
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న సంగతి తెలిసిందే. నిత్యం వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతోపాటు 12 తరగతి బోర్డు పరీక్షలను వాయిదా వేస్తున్నామని.. జూన్‌లో పరిస్థితులను సమీక్షించిన అనంతరం తదుపరి నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ ఇటీవలే వెల్లడించారు.
Also Read: ఒకే అమ్మాయిని నాలుగు సార్లు పెళ్లి చేసుకున్నాడు.. రీజన్ తెలిస్తే ఫ్యూజులు ఎగిరి పోవాల్సిందే.!