కరోనా మహమ్మారి నుంచి ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు త్వరగా కోలుకోవాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో ఆయన పేరు మీద ప్రత్యేక పూజలు చేయాలని తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కోరారు. దేవాలయాల్లో నిత్యం జరిగే పూజల్లో సీయం కేసీఆర్ కు ఆరోగ్య సిద్ధి చేకూరాలని, ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో కరోనా నుంచి క్షేమంగా బయటపడాలని అర్చనలు చేయాలని పూజరులకు సూచించారు. సీయం కేసీఆర్ ప్రజలు, భగవంతుడి ఆశీస్సులతో త్వరలో కోలుకొని, సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఎప్పటిలాగే ప్రజాసేవలో నిమగ్నమవ్వాలని మంత్రి ఆకాంక్షించారు.
వైద్య బృందం పర్యవేక్షణలో కేసీఆర్…
సీఎం కేసీఆర్ సోమవారం కరోనా పరీక్ష చేయించుకోగా…ఆయనకు పాజిటివ్ నిర్థారణ అయ్యింది. సీఎం కేసీఆర్‌కు కరోనా సోకినట్లు తనకు సమాచారమిచ్చినట్లు తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ ఓ ప్రకటనలో వెల్లడించారు. వైద్యుల సలహా మేరకు ఆయన ఫాం హౌస్‌లో హోం ఐసొలేషన్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు. కేసీఆర్‌కు స్వల్ప లక్షణాలే ఉన్నాయి. ప్రత్యేక వైద్యుల బృందం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోంది.