
తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది.. పగటిపూట ఎండ కాస్తున్నప్పటికీ.. సాయంత్రం కాగానే వాతావరణం ఒక్కసారిగా చల్లబడి రాత్రివేళల్లో రికార్డు స్థాయి కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని ఏజెన్సీ ప్రాంతాల్లో చలి పంజా విసురుతోంది.. కొన్ని ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలే నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. రాబోయే రెండు, మూడు రోజుల పాటు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీల మేర తగ్గే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.. తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత మరింత పెరుగుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
తెలంగాణ రాష్ట్రంలో క్రింది స్థాయి గాలులు ప్రధానముగా తూర్పు – ఈశాన్య దిశ నుండి వీస్తున్నవి.. దీని ప్రభావంతో చలి తీవ్రత పెరుగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.. శుక్రవారం, శనివారం, ఆదివారం తెలంగాణలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. రాబోయే రెండు రోజుల్లో హైదరాబాద్ సహా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2°C నుండి 3°C తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది.
ఇక ఆంధ్రప్రదేశ్‌లోని ఏజెన్సీ ప్రాంతాల్లో, ముఖ్యంగా ఉమ్మడి విశాఖ, అరకు, పాడేరు, చింతపల్లిలో చలి తీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రతలు తగ్గడంతో ఏజెన్సీ వాసులు గజగజలాడుతున్నారు. ఏపీ రాష్ట్రంలో శుక్రవారం, శనివారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది. రాగల 2 రోజుల్లో కోస్తా ఆంధ్రప్రదేశ్, యానం, రాయలసీమ లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశముంది.
కాగా.. తెలంగాణలో కోహీర్‌లో 6.4 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదవ్వగా.. ఏపీలో మినుములూరు 6, అరకు 5, పాడేరు , చింతపల్లిలో 8.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..