బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..! తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఇదిగో లేటెస్ట్ వెదర్ అప్డేట్
Andhra Pradesh and Telangana Weather Update: ఏపీ, తెలంగాణలో రానున్న మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. తూర్పు తెలంగాణ, ఉత్తర కోస్తాంధ్రపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. నవంబర్ 13న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని IMD వెల్లడించింది.

హైదరాబాద్ / అమరావతి: అర్నాబ్, మురసు వరుస తుఫాన్లతో ఏపీ అతలాకుతలమైంది.. ఈ క్రమంలోనే.. వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వెల్లడించింది. ఈ క్రమంలోనే.. తూర్పు తెలంగాణ, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతాలపై గురువారం ఏర్పడిన ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఈ ఆవర్తన ప్రభావంతో రాగల మూడు రోజుల పాటు కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలతో పాటు ఉరుముల జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అంతేకాకుండా.. తెలంగాణలో కూడా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
ఏపీ తెలంగాణకు వర్ష సూచన:
శనివారం రోజున పలు జిల్లాల్లో మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కోస్తాంధ్ర – రాయలసీమ: అల్లూరి సీతారామరాజు, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, కృష్ణా, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశముంది. తెలంగాణలో కూడా అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
బంగాళాఖాతంలో కొత్తగా అల్పపీడనం:
ఈ నెల 13న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడటానికి అనుకూల వాతావరణం నెలకొందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. ఈ అల్పపీడనం నవంబర్ 15 నాటికి నైరుతి బంగాళాఖాతం వైపు పయనిస్తూ మరింత బలపడే అవకాశముంది. తదుపరి రెండు వారాల వాతావరణ స్థితిగతులపై విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ఈ వ్యవస్థ తీవ్ర వాయుగుండంగా మారే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని స్పష్టం చేశారు. దీని ప్రభావంతో నవంబర్ 12 నుండి 18 వరకు తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందాని వాతావరణ నిపుణులు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
