Hyderabad: ఇన్‌స్టాలో పరిచయమయ్యాడు.. ఇటు అమ్మాయిని.. అటు తల్లిని నమ్మించి..

ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన యువతిని ప్రేమ, పెళ్లి పేరుతో నమ్మించి రూ.34 లక్షలు కాజేసిన ఘటన హైదరాబాద్ పంజాగుట్టలో వెలుగుచూసింది. వ్యాపార విస్తరణ పేరుతో బాధితురాలు, ఆమె తల్లి నుంచి దశలవారీగా డబ్బులు తీసుకున్న నిందితుడు చందు అప్పటికే వివాహితుడని దర్యాప్తులో తేలింది. నిజం తెలుసుకుని ప్రశ్నించిన యువతిపై దాడి చేసి బెదిరింపులకు పాల్పడటంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Hyderabad: ఇన్‌స్టాలో పరిచయమయ్యాడు.. ఇటు అమ్మాయిని.. అటు తల్లిని నమ్మించి..
Instagram Love Scam

Edited By:

Updated on: Jul 02, 2026 | 12:19 PM

సోషల్ మీడియా ద్వారా మొదలైన పరిచయం.. ప్రేమగా మారింది. ఆ తర్వాత పెళ్లి హామీ.. చివరకు అది భారీ మోసంగా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన యువతిని ప్రేమ పేరుతో నమ్మించి, పెళ్లి చేసుకుంటానంటూ శారీరకంగా దగ్గరైన ఓ యువకుడు మాస్టర్ ప్లాన్ వేశాడు.. ఆమెతో పాటు ఆమె తల్లి నుంచి రూ.34 లక్షలు తీసుకుని మోసం చేసిన ఘటన హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. ఆ తర్వాత ప్రేమ, పెళ్లి పేరుతో నమ్మకం కలిగించిన యువకుడు.. ఈ విధంగా భారీ మోసానికి తెరలేపినట్లు పోలీసులు తెలిపారు.

పోలీసుల వివరాల ప్రకారం.. ఎన్. చందు అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా బాధిత యువతితో పరిచయం పెంచుకున్నాడు. కొద్దికాలానికే ప్రేమిస్తున్నానని, త్వరలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెతో సన్నిహిత సంబంధం కొనసాగించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు..

వ్యాపారం పేరుతో రూ.34 లక్షలు..

ఈ క్రమంలోనే.. ప్రేమను ఆసరాగా చేసుకున్న చందు.. తన వ్యాపారాన్ని విస్తరించేందుకు అత్యవసరంగా డబ్బులు కావాలని చెప్పి దశలవారీగా బాధితురాలు, ఆమె తల్లి నుంచి మొత్తం రూ.34 లక్షలు తీసుకున్నట్లు బాధితురాలు ఆధారాలతో పాటు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పెళ్లి తర్వాత అన్నీ సర్దుకుంటాయని నమ్మబలికి డబ్బులు తీసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

అప్పటికే పెళ్లైన వ్యక్తి.. నిజం దాచిపెట్టాడా?..

దర్యాప్తులో కీలకంగా మారిన అంశం ఏమిటంటే.. చందు అప్పటికే మరో మహిళను వివాహం చేసుకున్నాడని, ఆ విషయాన్ని పూర్తిగా దాచిపెట్టి బాధితురాలితో ప్రేమ వ్యవహారం కొనసాగించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయాన్ని బాధితురాలు తర్వాత తెలుసుకున్నట్లు పోలీసుల ముందు వెల్లడించింది. తనను మోసం చేశారని తెలుసుకున్న బాధితురాలు చందును నిలదీయగా, ఆమెపై దాడి చేసి దుర్భాషలాడడంతో పాటు బెదిరింపులకు పాల్పడినట్లు ఫిర్యాదు చేయడంతో దీంతో బాధితురాలు పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించింది.

బాధితురాలి ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డబ్బు లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు, బ్యాంకు ఖాతాల వివరాలు, సోషల్ మీడియా చాట్స్, కాల్ రికార్డులు, ఇతర డిజిటల్ ఆధారాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. అలాగే నిందితుడిపై గతంలో ఇలాంటి ఫిర్యాదులు ఉన్నాయా అనే అంశాన్ని కూడా విచారిస్తున్నారు. ఈ కేసులో దర్యాప్తు అనంతరం పూర్తి వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us