రష్యా-ఉక్రెయిన్ యుద్ధం(Russia-Ukraine war) సామాన్య ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటికే ఇంధన ధరలు పెరిగి చుక్కలు చూపిస్తుండగా.. వంటింట్లో నూనె కూడా సలసల కాగుతోంది. పామాయిల్ ఎగుమతులను నిలిపివేస్తున్నట్లు ఇండోనేషియా ప్రకటించడంతో వంట నూనెల(Cooking Oil) ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. యుద్ధం కారణంగా నెలన్నర కిందట ఆకాశాన్నంటిన వంటనూనెల ధరలు.. కొంత తగ్గాయి. ఇండోనేషియా తీసుకున్న నిర్ణయంతో తెలుగు రాష్ట్రాల్లో టోకు వ్యాపారులు పామాయిల్ విక్రయాలను నిలిపివేశారు. ఈ ప్రభావం అన్ని వంటనూనెల ధరలపై పడింది. వారం క్రితం లీటరు పామాయిల్ ధర రూ.140కి చేరగా ఇప్పుడు రూ.150.. ముందు ముందు రూ.160 అయ్యే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. తెలంగాణ(Telangana) లో వినియోగించే వంట నూనెల్లో పామాయిల్ అమ్మకాలే 60 శాతానికి పైగా ఉంటున్నాయి. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరల కారణంగా వంట నూనెలు, కూరగాయలు, పప్పులు, ఇతర నిత్యావసరాల ధరలన్నీ పెరుగుతున్నాయని వ్యాపారులు అంటున్నారు.
మహారాష్ట్రలోని నాసిక్ నుంచి హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని అనేక మార్కెట్లకు ఉల్లిగడ్డలు వస్తుంటాయి. ఈ ఏడాది వ్యవధిలో లారీ లోడు కిరాయి గతేడాది కన్నా రూ.3 – 4 వేలు అదనంగా పెంచేశారు. హైదరాబాద్ పండ్ల మార్కెట్‌ను కొత్తపేట నుంచి నగర శివారులోని బాటసింగారానికి మార్చారు. ఇక్కడ పండ్లు కొన్న వ్యాపారులు చందానగర్, లింగంపల్లి, కొంపల్లి వంటి ప్రాంతాలకు రానుపోను 100-120 కిలోమీటర్ల రవాణా వ్యయం భరించాల్సి వస్తుండడంతో ఆ మేర పండ్ల ధరలను పెంచేస్తున్నారు.
ఆటో, క్యాబ్ కిరాయిలు కూడా రూ.20-40 దాకా పెంచేశారు. సరిగ్గా ఏడాది క్రితం 2021 ఏప్రిల్ 24న లీటరు పెట్రోలు ధర రూ.94.13 ఉంటే ఇప్పుడు రూ.119.49కి చేరింది. ఇలాగే డీజిల్ ధర రూ.88.18 నుంచి 105.49కి పెరిగింది. దేశంలో మినుముల దిగుబడి బాగా తగ్గడంతో మినపగుండ్లు, మినప్పప్పు ధర చిల్లర మార్కెట్‌లో కిలోకు రూ.20-30 దాకా పెంచేశారు. పెట్రో ధరల పెరుగుదల వల్ల క్యాబ్‌లో వెళ్లే సమయంలో ఏసీ ఆన్ చేయడం లేదని, ఎవరైనా ఏసీ అడిగితే కిరాయిపై అదనంగా రూ.10-20 వసూలు చేస్తున్నారు.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
Andhra Pradesh: టీచర్లకు సెలవులు రద్దు.. ఎమర్జెన్సీ తప్ప మిగతా సమయాల్లో విధుల్లో ఉండాల్సిందే