AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

5 కిలోమీటర్ల జర్నీకి అరగంట.. విజయవాడ-హైదరాబాద్ హైవేపై ఏం జరుగుతోంది..

దసరా పండుగ నేపథ్యంలో హైదరాబాద్‌ నుంచి సొంతూళ్లకు వెళ్లే వాహనాలతో హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారి (NH-65) రద్దీగా మారింది. ముఖ్యంగా చౌటుప్పల్‌లో ఫ్లైఓవర్‌ నిర్మాణ పనుల కారణంగా వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. వలిగొండ రోడ్డు జంక్షన్‌ నుంచి ధర్మోజిగూడెం వరకు ఐదు కిలోమీటర్లు ప్రయాణించడానికి సుమారు అరగంట పడుతోందని వాహనదారులు పేర్కొంటున్నారు

5 కిలోమీటర్ల జర్నీకి అరగంట.. విజయవాడ-హైదరాబాద్ హైవేపై ఏం జరుగుతోంది..
Hyderabad Vijayawada Highway Traffic
Shaik Madar Saheb
|

Updated on: Oct 13, 2026 | 9:56 AM

Share

హైదరాబాద్ నుంచి దసరా పండుగ కోసం నగరవాసులు ఊళ్లబాట పట్టడంతో.. హైదరాబాద్ విజయవాడ హైవే వాహనాలతో కిటకిటలాడుతోంది. వాస్తవానికి.. రెండు తెలుగు రాష్ట్రాలకు వారధిగా ఉండే.. హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారికి దేశంలోనే అత్యధిక వాహన రద్దీ కలిగిన హైవేగా పేరుంది. ఈ జాతీయ రహదారి నిత్యం రక్తసిక్తం అవుతూనే ఉంది. ప్రమాదాల నివారణకు హైవేపై చేపట్టిన అండర్ పాస్‌ల నిర్మాణ పనులు నత్తకు నడక నేర్పేలా సాగుతుండడంతో వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదు. ఈ హైవేను 2015లో నాలుగు లైన్లుగా అభివృద్ధి చేసినా.. కేవలం అక్కడక్కడ మాత్రమే అండర్ పాస్‌లు నిర్మించారు. నిత్యం 45వేల వాహనాలకు పైగా రాకపోకలు సాగుతున్నాయి. సెలవు దినాల్లో వాహనాల రద్దీ ఎక్కువగా ఉండడంతో 181 కిలోమీటర్ల మేర ప్రయాణానికి నాలుగున్నర నుంచి ఐదు గంటలు పడుతోంది.

NH -65పై ప్రమాదాలు జరుగుతున్న 17బ్లాక్ స్పాట్‌ల దగ్గర రూ.370 కోట్లు రూపాయలతో అండర్‌ పాస్‌లు, ఫ్లై ఓవర్ బ్రిడ్జిల నిర్మాణాలు రెండేళ్ల క్రితం చేపట్టారు. చౌటుప్పల్, పెదకాపర్తి, చిట్యాల, టేకుమట్లతో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని SV ఇంజినీరింగ్ కాలేజీ విద్యుత్ సబ్ స్టేషన్ దగ్గర అండర్ పాస్ నిర్మాణాలు ప్రారంభించారు. రెండేళ్లుగా ఈ పనులు చాలా స్లోగా కొనసాగుతున్నాయి. చౌటుప్పల్‌లో 2.45 కిలోమీటర్ల పొడవునా ఫ్లై వోవర్ నిర్మాణ పనులు నెమ్మదిగా సాగడం వాహనదారులకు నరకం చూపిస్తోంది. వలిగొండ రోడ్డు జంక్షన్ నుంచి ధర్మోజిగూడెం వరకు 5 కిలోమీటర్లు దాటేందుకు ఒక్కో వాహనానికి 30 నిమిషాలు పడుతోంది. చౌటుప్పల్‌ పట్టణంలో వాహనాలు బంపర్ టు బంపర్ కదిలే పరిస్థితి చూసి వాహనదారులు చుక్కలు చూస్తున్నారు.

చౌటుప్పల్ పట్టణంతోపాటు, నల్లగొండ జిల్లా చిట్యాల ప్రధాన కూడలిలో ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతుండటంతో వాహనాలను సర్వీస్ రోడ్ల వెంట మళ్లిస్తున్నారు. బస్టాండ్, చిన్నకొండూరు రోడ్డు దగ్గర వాహనాలు హైవే మీదకు వెళ్లే సందర్భంలో, విజయవాడ వైపునకు వెళ్లే వాహనాలను కొద్దిసేపు ఆపుతున్నారు. చౌటుప్పల్ చిన్న కొండూరు, వలిగొండ జంక్షన్ మూసివేతతో స్థానికులకు ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదు. దసరా పండుగ వాహనాలు విజయవాడ రూట్లో బారులు తీరడంతో ఇతర వాహనాలు రోడ్డు క్రాస్ చేసేందుకు ఇబ్బందులు పడుతున్నారు.

హైదరాబాద్ విజయవాడ హైవేపై బ్లాక్ స్పాట్స్ దగ్గర నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. ఈ పనులను సంక్రాంతి నాటికి పూర్తి చేస్తామని చెబుతున్నారు.

హైవేపై బ్లాక్ స్పాట్స్ కంప్లీట్ చేయడానికే ఏళ్లకు ఏళ్లు పడుతోంది. ఇక ఆరు లేన్ల విస్తరణకు ఇంకెన్నేళ్లు టైమ్ తీసుకుంటారో, ఆ టైమ్‌లో ఇంకెంత ఇబ్బంది పడాల్సి వస్తుందోనని స్థానికులతో పాటు వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కాంట్రాక్టర్ల వెంటపడి త్వరగా పనులు పూర్తి చేయాలని కోరుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us