Telangana: వస్తావా.? అని అడిగారు.. తీరా వెళ్లాక అసలు సినిమా చూపించింది.!

హైదరాబాద్‌ రోడ్లపై అర్ధరాత్రి ఓ ఆడపిల్ల ఒంటరిగా నిలబడితే.. ఏమైనా ప్రాబ్లమా? సాయం కావాలా? అని బాధ్యతగా అడిగే మగాళ్లు ఎంత మంది ఉంటారు? అలాంటి వాళ్లు ఎంత మంది ఉంటారో తెలియదుగాని.. ఎంతకొస్తావ్‌? ఎక్కడికెళ్దాం? అని అడిగే బ్యాచ్‌కు మాత్రం కొదవుండదు.

Telangana: వస్తావా.? అని అడిగారు.. తీరా వెళ్లాక అసలు సినిమా చూపించింది.!
Telangana

Updated on: May 06, 2026 | 11:48 AM

మల్కాజ్‌గిరి పోలీస్‌ కమిషనర్‌గా బాధ్యతలు తీసుకున్న తొలిరోజే గ్రౌండ్‌ సిట్యుయేషన్‌పై ఫోకస్‌ చేసిన సుమతి.. పోకిరీలకు ఊహించని షాక్‌ ఇచ్చారు. అర్ధరాత్రి ఫీల్డ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె.. సంచలన ఆపరేషన్ నిర్వహించారు. ఇటీవల కాలంలో అరాచకాలకు అడ్డాగా మారిన దిల్‌సుఖ్‌నగర్‌ బస్టాండ్‌ను ఎంచుకున్నారు. అర్ధరాత్రి వేళ.. ఒంటరిగా, ఎలాంటి సెక్యూరిటీ లేకుండా.. ఆ ఏరియాకు వెళ్లారు సుమతి. పోలీస్‌ కమిషనర్‌గా కాదు, సగటు మహిళగా రోడ్డుపై బస్సుకోసం ఎదురుచూస్తూ నిల్చున్నారు. అర్ధరాత్రి 12గంటల నుంచి మూడింటి వరకు.. ఆమె అక్కడే ఉన్నారు. కమిషనర్‌గా సెక్యూరిటీ మధ్య కాదు.. కామన్‌ లేడీగా అర్ధరాత్రి రోడ్డెక్కితే.. పరిస్థితి ఎలా ఉంటుందో, కళ్లారా చూశారు.

ఇక, ఇంతలో అక్కడ అసలు సినిమా మొదలైంది. సుమతి ఎవరో తెలియక పోకిరీలు చుట్టు ముట్టేశారు. అందరూ వస్తావా అనేవాళ్లే? ఎంతివ్వాలంటూ ఆఫర్ ఇచ్చేవాళ్లే? ఎటు వెళ్దామంటూ అడిగే బాపతుగాళ్లే?
అసలు ఇప్పటివరకూ ఆడముఖమే చూడనట్టుగా ఎగబడిపోయారు కొందరు. ఒకటి కాదు రెండు కాదు, దాదాపు మూడుగంటల పాటు.. దిల్‌ సుఖ్‌ నగర్‌ మెయిన్‌రోడ్డుపై ఇదే సీన్‌. అటువైపుగా ఒక్క పోలీస్‌ కూడా రాలేదు, పెట్రోలింగ్‌ వెహికిలూ రాలేదు. దీంతో, మరింత రెచ్చిపోయిన పోకిరీలు.. ఆమె తప్పించుకుని ముందుకు వెళ్తున్నా వినలేదు. బైకులు తీసుకొచ్చి ఆమె ముందే ఆపారు. వెకిలి చేష్టలతో విసుగు పుట్టించారు.

సుమతిని చుట్టుముట్టిన పోకిరిల్లో ఎక్కువ మంది విద్యార్థులే ఉండటం పరిస్థితికి అద్దం పడుతోంది. వాళ్లంతా మద్యం, గంజాయి మత్తులో ఉన్నారు. ఆ మైకంలోనే..అసభ్య ప్రశ్నలతో సుమతిని తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. అయినా ధైర్యంతో అక్కడే నిలబడి.. అందర్నీ గమనిస్తూ ఉండిపోయారు సుమతి. చివరాఖరికి సమయం మూడున్నర అవుతుండగా… అటువైపు వచ్చాడో బీట్‌ కానిస్టేబుల్‌. అప్పటిదాకా ఆమె చుట్టూ మృగాళ్ల మధ్య అక్కడ ఒంటరే. అప్పుడే ఆమె ఎవరో తెలిసింది. ఆ తర్వాత ఓ ఎస్సై వచ్చి సెల్యూట్‌ కొట్టగానే.. ఆమె లేడీ సింగం… విశ్వనగరపు తొలి మహిళా పోలీస్‌ కమిషనర్‌ ఐపీఎస్‌ సుమతి అని తెలిసిపోయింది. అది చూసి షాకవడం పోకిరీల వంతయ్యింది.

అప్పటిదాకా.. క్యా పొట్టీ హై మామా అంటూ కామెంటేసిన ఆకతాయిలు.. పోలీస్‌ జీప్‌ ఎక్కాల్సి వచ్చింది. ఈ మూడుగంటల ఆపరేషన్‌లో దాదాపు 40మంది పోకిరీల పనిపట్టారు ఐపీఎస్ సుమతి. వాళ్లందరినీ అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చారు. వారిలో ఎక్కువ మంది విద్యార్థులు, ఉద్యోగార్థులే ఉన్నట్టు గుర్తించారు. చుట్టూ ఉన్న హాస్టల్స్‌లో నివాసముంటున్న ఈ బ్యాచ్‌.. రాత్రయితే చాలు ఇలా రోడ్లమీద పడుతున్నట్టు గుర్తించిన సుమతి… మూడ్రోజులుగా ఈ ఏరియాపై స్పెషల్‌ ఫోకస్‌ చేశారు. అలాంటి బ్యాచ్‌కు ఇప్పుడు.. అదిరిపోయే షాకిచ్చారు. రోడ్డుపై ఆడపిల్ల కనిపించగానే చొంగ కార్చడం కాదు… చొరవ తీసుకుని వీలైతే సాయం చేయాలని సూచించారు. చదువు, కెరీర్‌ మీద ఫోకస్‌ చేయాలనీ బ్రెయిన్‌ వాష్‌ చేయడమే కాదు… మద్యం, గంజాయి అలవాట్లను వదులుకోకపోతే తోకలు కత్తిరిస్తానని హెచ్చరించి పంపించారు.

అర్ధరాత్రి ఆడసింగం… హైదరాబాద్‌లో ఇప్పుడీ స్పెషల్‌ ఆపరేషన్ హాట్‌టాపిక్‌గా మారింది. అయితే ఇలాంటి సాహసాలు చేయడం సుమతికి కొత్తేం కాదు. 2001లో డీఎస్పీగా బాధ్యతలు తీసుకున్నాక… కాజీపేట రైల్వే స్టేషన్ దగ్గర కూడా… ఇలాగే నిలబడ్డారు సుమతి. ఆడది కనిపిస్తే అంగడి సరుకులా భావించే మగమృగాళ్లకు బుద్ధి చెప్పారు. సరిగ్గా పాతికేళ్ల తరువాత… మళ్లీ అలాగే… తనస్టయిల్‌లో పోకిరీలకు బుద్ధి చెప్పారు. కాకపోతే, ఈసారి అడ్డా దిల్‌సుఖ్‌నగర్ బస్టాప్‌కు మారింది. ఆవిడ ఐపీఎస్‌ సుమతి కాబట్టి… పక్కా వ్యూహంతో, ప్లానింగ్‌తో వెళ్లారు కాబట్టి … ఎలాంటి ప్రమాదమూ జరగలేదు. అదే నిజంగా ఒక కామన్‌ ఉమన్‌ ఆ ప్లేసులో ఉండుంటే… ఆ నలభై మంది మృగాళ్ల మధ్య.. పరిస్థితి ఏమయ్యేది. ఊహించడానికే భయానకంగా ఉంది కదా. అంటే.. ఇప్పటికీ హైదరాబాద్‌ నగరంలో అలాంటి భయానక పరిస్థితులు ఉన్నాయనే దానికి.. మాత్రం లేటెస్ట్‌ పోలీస్‌ ఆపరేషన్‌.. అద్దం పడుతోంది.

Follow Us