హైదరాబాద్‌లోని మందుబాబులకు ముఖ్య అలెర్ట్.. ఈ రోజు నుంచి 24 గంటల పాటు మద్యం షాపులు మూతపడనున్నాయి. భాగ్యనగరంలో హనుమాన్ జయంతి శోభాయాత్ర ఘనంగా నిర్వహిస్తుండటంతో సైబరాబాద్ కమీషనరేట్ పరిధిలోని హైదరాబాద్ పోలీస్ పలు ఆంక్షలు విధించారు. హైదరాబాద్ నగర పరిధిలోని అన్ని మద్యం దుకాణాలు, కల్లు షాపులు, రెస్టారెంట్లలోనూ బార్లను ఏప్రిల్ 16వ తేదీ ఉదయం 6 గంటల నుంచి ఏప్రిల్ 17న ఉదయం 6 గంటల వరకు మూసి వేయాలని హైదరాబాద్ పోలీస్ కమీషనర్ సి.వి. ఆనంద్ కీలక ప్రకటన విడుదల చేశారు. కేవలం స్టార్ హోటల్స్, రిజిస్టర్డ్ క్లబ్స్‌లోని బార్లకి మాత్రం ఈ నిబంధన వర్తించదని పేర్కొన్నారు. ఈ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని.. లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇదిలా ఉంటే.. హైదరాబాద్‌లో ఏటా హనుమజ్జయంతి సందర్భంగా వీరహనుమాన్ విజయయాత్రను నిర్వహిస్తారు. ఈ యాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసులు మోహరించారు. గౌలిగూడ రామ్‌మందిర్ నుంచి తాడ్‌బండ్‌లోని వీరాంజనేయస్వామి దేవాలయం వరకూ 21 కిలోమీటర్ల మేర ఈ యాత్ర కొనసాగనుంది. శనివారం ఉదయం 11 గంటలకు ప్రారంభమై రాత్రి 8 గంటలకు యాత్ర ముగియనుంది. ఊరేగింపు జరగనున్న ప్రాంతాల్లో శనివారం ఉదయం 11గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 12.30 సమయంలో గౌలిగూడ రామ్‌మందిర్ నుంచి ఆంధ్రా బ్యాంక్ కోఠి వరకు, మధ్యాహ్నం 12.30 – 1.30 వరకు కోఠీలోని డీఎంహెచ్ కార్యాలయం నుంచి కాచిగూడ క్రాస్‌రోడ్స్ వరకు, మధ్యాహ్నం 1.30 – 2.15 గంటల వరకు కాచిగూడ క్రాస్‌రోడ్స్ నుంచి నారాయణగూడ క్రాస్ రోడ్స్ వరకు, మధ్యాహ్నం 2.15 – 4.15 ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, వీఎస్‌టీ, బాగ్‌లింగంపల్లి, ఇందిరాపార్క్, కవాడీగూడ క్రాస్‌రోడ్స్ వరకు, సాయంత్రం 4.15-5.45 పాత రాంగోపాల్‌పేట ఠాణా వరకు, సాయంత్రం 6 – 7 ప్యారడైజ్ కూడలి నుంచి బ్రూక్‌బాండ్ కాలనీ వరకు, సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు బ్రూక్‌బాండ్ నుంచి తాడ్‌బండ్ వీరాంజనేయ స్వామిదేవాలయం వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.