హైదరాబాద్‌లో WFH అమలు చేస్తే.. ఎంత పెట్రోల్ సేవ్ అవుతుందో తెల్సా..

ప్రతీ ఒక్కరికి హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో నిత్యం ఉండే ట్రాఫిక్ కష్టాలు స్పష్టంగా తెలుసు. వేల సంఖ్యలో వాహనాలు గంటల తరబడి సిగ్నల్స్ వద్ద ఆగిపోవడం వల్ల ఎంతో విలువైన ఇంధనం వృథా అవుతోంది. ముఖ్యంగా గచ్చిబౌలి, మాదాపూర్ లాంటి ప్రాంతాల్లో సాయంత్రం వేళల్లో పరిస్థితి దారుణంగా ఉంటుంది.

హైదరాబాద్‌లో WFH అమలు చేస్తే.. ఎంత పెట్రోల్ సేవ్ అవుతుందో తెల్సా..
Hyderabad Traffic

Updated on: May 13, 2026 | 12:17 PM

హైదరాబాద్ లాంటి మెట్రో నగరాల్లో ట్రాఫిక్ కష్టాల గురించి మనందరికీ తెలిసిందే. ఉదయం ఆఫీసులకు వెళ్లేటప్పుడు, సాయంత్రం తిరిగి వచ్చేటప్పుడు రోడ్ల మీద వాహనాల రద్దీ చూస్తే చుక్కలు కనిపిస్తాయి. ముఖ్యంగా ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ జామ్ అనేది నిత్యకృత్యం. ఇటీవల ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడు ఇంధన ఆదా చేసుకోవాలని.. వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్‌లైన్ మీటింగ్స్‌కి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. అయితే, ఒకవేళ ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యాన్ని అమలు చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించారా? దీనివల్ల కేవలం సమయం మాత్రమే కాదు, కోట్లాది రూపాయల ఇంధనం కూడా ఆదా అవుతుందని తాజా గణాంకాలు చెబుతున్నాయి.

హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో ప్రస్తుతం దాదాపు 9 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో చాలా మంది సొంత వాహనాలైన బైక్‌లు, కార్లలో ఆఫీసులకు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ రద్దీ వల్ల రోడ్లన్నీ వాహనాలతో నిండిపోతున్నాయి. ఒకవేళ వీరిలో సగం మందికి, అంటే సుమారు 4.5 లక్షల మందికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తే, రోజుకు ఏకంగా 3.6 లక్షల లీటర్ల పెట్రోల్ ఆదా అవుతుందని అంచనా. ఇది పర్యావరణానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.

ఒక సామాన్యుడి దృష్టితో ఆలోచిస్తే, పెట్రోల్ ధరలు ఏ క్షణమైనా పెరుగుతుందని, ఇంధన నిండుకుంటోందని వార్తలు వస్తున్న తరుణంలో.. ఈ రోజుల్లో ఇంతటి ఇంధనం ఆదా అవ్వడం అంటే పెద్ద ఊరట. ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర సుమారు రూ. 107.50గా ఉంది. ఒక్కో వ్యక్తి సగటున 20 కిలోమీటర్లు ప్రయాణిస్తాడనుకుంటే, 4.5 లక్షల మంది ప్రయాణం చేయకపోవడం వల్ల మొత్తం 90 లక్షల కిలోమీటర్ల మేర ప్రయాణం తగ్గుతుంది. లీటరుకు సగటున 25 కిలోమీటర్ల మైలేజీని లెక్కలోకి తీసుకున్నా, రోజుకు రూ. 3.87 కోట్లు ఆదా అవుతున్నట్లు లెక్క.

Follow Us