Hyderabad: హైదరాబాద్‌ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ ఏరియాల్లో మంచినీళ్లు తాగే ముందు జాగ్రత్త.. ఎందుకంటే..

హైదరాబాద్ నగరంలో కొన్ని ప్రాంతాల్లో నీరు తాగి చాలామంది ప్రజలు అస్వస్థత బారిన పడుతున్నారు. ముఖ్యంగా నాగోల్‌ పరిధిలోని శ్రీలక్ష్మీనగర్‌, శ్రీనివాస్‌నగర్‌, విశాలాంధ్ర కాలనీ ప్రాంతాల్లో కలుషిత తాగునీరు సరఫరా అవుతుందని.. పలువురు అనారోగ్యం బారిన పడ్డారని.. స్థానికులు చెప్పడం కలకలం రేపుతుంది.

Hyderabad: హైదరాబాద్‌ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ ఏరియాల్లో మంచినీళ్లు తాగే ముందు జాగ్రత్త.. ఎందుకంటే..
Drinking Water Supply

Edited By:

Updated on: Jan 28, 2026 | 5:39 PM

హైదరాబాద్ నగరంలో కొన్ని ప్రాంతాల్లో నీరు తాగి చాలామంది ప్రజలు అస్వస్థత బారిన పడుతున్నారు. ముఖ్యంగా నాగోల్‌ పరిధిలోని శ్రీలక్ష్మీనగర్‌, శ్రీనివాస్‌నగర్‌, విశాలాంధ్ర కాలనీ ప్రాంతాల్లో కలుషిత తాగునీరు సరఫరా అవుతుందని, పలువురు అనారోగ్యం బారిన పడ్డారని.. ఆ ప్రాంతాల్లోని ప్రజలు చెబుతుండటం కలకలం రేపుతుంది. జలమండలి ఆధ్వర్యంలో సరఫరా అవుతున్న నీరు ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెడుతోంది. మాన్సూరాబాద్‌ డివిజన్‌కు చెందిన ఈ ప్రాంతాల్లో వాటర్‌ బోర్డు సరఫరా చేస్తున్న నీరు కలుషితమైందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గత నెల రోజులుగా నీటి రంగు మారిపోయిందని.. గత నాలుగు రోజులుగా సమస్య మరింత తీవ్రతరమైందని ఈ ప్రాంత వాసులు చెబుతున్నారు. అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ సరైన స్పందన లేదని ఆరోపిస్తున్నారు. కలుషిత నీరు వినియోగించడంతో పలువురు అనారోగ్యానికి గురయ్యారు. ఓ కుటుంబంలో భార్యాభర్తలకు డయేరియా, జ్వరం రావడంతో చికిత్స తీసుకున్నట్లు స్థానికులు తెలిపారు. భర్త కోలుకున్నప్పటికీ భార్య ఇంకా అనారోగ్యంతోనే.. బాధపడుతున్నట్లు వెల్లడించారు.

గతేడాది కూడా ఇలాంటి సమస్యే ఎదురైందని కాలనీవాసులు గుర్తు చేస్తున్నారు. ఈసారి కూడా సమస్యను నిర్లక్ష్యం చేస్తే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీవరేజ్‌ పనుల కారణంగా కలుషిత నీరు రోడ్లపైకి పొంగిపొర్లి దుర్వాసన వస్తోందని, దోమలు, ఈగలు పెరిగే ప్రమాదం ఉందని స్థానికులు చెబుతున్నారు. బోరు బావులు లేని కుటుంబాలకు తాగునీటితో పాటు వంట అవసరాలకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోతున్నారు. బయట నుంచి నీటి క్యాన్లు కొనుగోలు చేసి అవసరాలు తీర్చుకుంటున్నామని తెలిపారు.

ఈ విషయంపై స్పందించిన హెచ్‌ఎంసీడబ్ల్యూఎస్‌ అండ్‌ ఎస్‌బీ అధికారులు, మొదటగా కనెక్షన్‌లో లీకేజీ ఉందని అనుమానించామని, అనంతరం ప్రధాన పైప్‌లైన్‌లో సమస్య గుర్తించామని తెలిపారు. ప్రస్తుతం పైప్‌లైన్‌ మార్పు పనులు జరుగుతున్నాయని, త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పారు. నీటి సరఫరా పునరుద్ధరిస్తామని, నీటి నాణ్యతను పూర్తిగా పరిశీలించిన తర్వాతే సరఫరా ప్రారంభిస్తామని అధికారులు స్పష్టం చేశారు. అయితే, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

కలుషిత నీటి సమస్యతో చిన్నపిల్లలు, వృద్ధులు ఎక్కువగా ప్రభావితమవుతున్నారని స్థానికులు చెబుతున్నారు. తాగునీటి కోసం గంటల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొందని, అత్యవసర సమయాల్లో కూడా సరైన సరఫరా లేక ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. తాత్కాలికంగా ట్యాంకర్ల ద్వారా అయినా స్వచ్ఛమైన నీటిని అందించాలని, వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..