AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: అంతా బయటకు వెళ్తే చాలు.. స్టడీ హాల్‌లో ఒక్కడే ఏం చేసేవాడో తెలుసా..?

హైదరాబాద్‌లో స్టడీ హాళ్లను టార్గెట్‌గా చేసుకుని ల్యాప్‌టాప్‌లు చోరీ చేస్తున్న ఇద్దరు నిందితులను నారాయణగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. విద్యార్థిలా స్టడీ హాల్‌లోకి ప్రవేశించి, ఇతర విద్యార్థులు బయటకు వెళ్లిన సమయంలో ల్యాప్‌టాప్‌లు చోరీ చేసిన నిందితుడు.. కేవలం నెల రోజుల్లో 19 ల్యాప్‌టాప్‌లు కొట్టేసినట్లు పోలీసులు తెలిపారు. చోరీ చేసిన ల్యాప్‌టాప్‌లను రిపేర్ వ్యాపారి ద్వారా విడిభాగాలుగా విక్రయిస్తున్నట్లు గుర్తించారు. మొత్తం 19 ల్యాప్‌టాప్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Hyderabad: అంతా బయటకు వెళ్తే చాలు.. స్టడీ హాల్‌లో ఒక్కడే ఏం చేసేవాడో తెలుసా..?
Hyderabad Laptop Theft
Ranjith Muppidi
| Edited By: |

Updated on: Sep 04, 2026 | 11:28 AM

Share

హైదరాబాద్‌లో స్టడీ హాళ్లను టార్గెట్‌గా చేసుకుని ల్యాప్‌టాప్‌లను చోరీ చేస్తున్న ఇద్దరు నిందితులను నారాయణగూడ పోలీసులు సెప్టెంబర్ 3న అరెస్ట్ చేశారు. చోరీ చేసిన ల్యాప్‌టాప్‌లను విడిభాగాలుగా విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నారాయణగూడ డిటెక్టివ్ సబ్‌ఇన్‌స్పెక్టర్ సీహెచ్ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. 29 ఏళ్ల సంగిశెట్టి వినీత్ స్టడీ హాళ్లలో విద్యార్థిలా ప్రవేశించి, చదువుకుంటున్నట్లు నటించేవాడు. విద్యార్థులు భోజనం లేదా ఇతర అవసరాల కోసం తమ క్యాబిన్ల నుంచి బయటకు వెళ్లిన సమయంలో వారి ల్యాప్‌టాప్‌లను గమనించి చోరీ చేసేవాడు. ఇలా కేవలం నెల రోజుల్లోనే 19 ల్యాప్‌టాప్‌లను దొంగిలించాడు. వాటి మొత్తం విలువ సుమారు రూ.7.60 లక్షలని పోలీసులు తెలిపారు.

నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేశవ్ మెమోరియల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (కేఎంఐటీ) కాలేజీ సమీపంలోని స్టడీ హాళ్లు, తెలుగు అకాడమీ ప్రాంతాల్లో వినీత్ వరుస చోరీలకు పాల్పడ్డాడు. చోరీ చేసిన ల్యాప్‌టాప్‌లను 29 ఏళ్ల వెమునూరి శ్రీనివాస్‌కు విక్రయించేవాడు. శ్రీనివాస్ ల్యాప్‌టాప్ రిపేర్ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆగస్టు 16న బ్రైట్ మైండ్స్ స్టడీ హాల్‌లో చదువుకుంటున్న వి. సురేష్ రాత్రి 7 గంటల సమయంలో భోజనం చేసేందుకు తన క్యాబిన్ నుంచి బయటకు వెళ్లాడు. సుమారు గంట తర్వాత తిరిగి వచ్చేసరికి తన ల్యాప్‌టాప్ కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఈ ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులపై నిఘా పెట్టారు. ఈ క్రమంలో గురువారం పార్సిగుట్ట సమీపంలో వినీత్, శ్రీనివాస్‌లను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి చోరీకి గురైన మొత్తం 19 ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ల్యాప్‌టాప్‌లను కోర్టుకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కమిషనరేట్ల పరిధిలో మొత్తం 16 కేసుల్లో ప్రమేయం ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us