
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. మెట్రో రైళ్లల్లో రద్దీని తగ్గించేందుకు ప్రభుత్వం మందడుగు వేసింది. ప్రస్తుతం పీక్ సమయాల్లో మెట్రోలలో విపరీతమైన రద్దీ ఉంటుంది. కనీసం నిల్చోవడానికి కూడా స్థలం ఉండటం లేదు. ఈ సమస్యతో మెట్రో ప్రయాణికులు ఎప్పటినుంచో ఇబ్బంది పడుతుండగా.. ఇప్పుడు పరిష్కరానికి ప్రభుత్వం సిద్దమైంది. రద్దీని తగ్గించేందుకు కొత్త రైళ్లను తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం కొత్త రైళ్లను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. ఒక్కొ రైల్లో 2 వేల మంది ప్రయాణించేందుకు వీలుగా 6 కోచ్‌ల రైళ్లను ప్రవేశపెట్టనుంది.
తొలి దశలో 60 కోచ్‌లను కొనుగోలు చేయనుండగా.. ఆరు కోచ్‌లతో కూడిన 10 కొత్త రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తారు. ఒక్కొ రైలుకు రూ.60 కోట్ల వరకు ఖర్చు కానుంది. 60 కోచ్‌ల కొనుగోలుకు రూ.600 కోట్ల వరకు వ్యయం కానుందని అంచనా వేశారు. త్వరలోనే కొత్త రైళ్ల కోసం టెండర్లను ఆహ్వానించనున్నారు. బిడ్ల కోసం నోటిఫికేషన్ జారీ చేసిన తర్వత తుది వ్యయం ఎంత అవుతుందనేది తెలియనుంది. ప్రస్తుతం ఉన్న మెట్రో రైళ్లల్లో మూడు కోచ్‌లు మాత్రమే అందుబాటులోకి ఉన్నాయి. దీంతో ఒకేసారి వెయ్యి మంది మాత్రమే ప్రయాణించడానికి వీలు కలుగుతుంది. అదే ఆరు కోచ్‌లు అందుబాటులోకి వస్తే ఒకేసారి 2 వేల మంది ప్రయాణించవచ్చు. ప్రయాణికుల సంఖ్య దాదాపు రెట్టింపు అవుతుంది. వీటి వల్ల ఒకేసారి ఎక్కువమంది ప్రయాణికులకు తమ గమ్యస్థానాలకు చేర్చవచ్చు.
ఎక్కువ కోచ్‌లు కలిగిన రైళ్లు ఉండటం వల్ల ప్రయాణికుల రద్దీ కూడా తగ్గుతుంది. ఉదయం, సాయంత్రం వేళల్లో రద్దీ విపరీతంగా ఉండటం వల్ల కనీసం అడుగు వేసేందుకు కూడా ఖాళీ స్థలం ఉండటం లేదు. దీని వల్ల ఇబ్బంది పడుతూ ప్రయాణం చేయాల్సి వస్తోంది. కొన్నిసార్లు తర్వాతి రైలు కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. ప్రస్తుతం మెట్రోలో రోజూ 4.5 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. అయితే కొత్త మెట్రో రైళ్లు వస్తే 6 లక్షల వరకు పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. అమీర్ పేట-రాయదుర్గం మార్గంలో ఎక్కువ రద్దీ ఉంటుంది. ఉదయం ఆఫీసులకు వెళ్లే సమయంలో, సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చే సమయాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల రాయదుర్గం స్టేషన్‌లో కొన్నిసార్లు ప్రయాణికులకు కొద్దిసేపు ఆపాల్సి వస్తోంది. రద్దీని నియంత్రించేందుకు అధికారులు ఈ ప్రయత్నం చేస్తున్నారు. దీంతో కొత్త రైళ్లను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇవి అందుబాటులోకి వస్తే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. సౌకర్యవంతంగా ప్రయాణం చేయవచ్చు.