హైదరాబాద్, ఆగస్టు 20: భార్యతో విభేదాల కారణంగా ఏకంగా ఆమెను ఆమె కుటుంబ సభ్యులపై విష ప్రయోగం చేశాడు ఓ భర్త.. లండన్ నుంచి వచ్చి మరి భార్యతో సహా ఆమె కుటుంబ సభ్యులపై విషప్రయోగం చేయించాడు. అయితే ఈ విషయం వెలుగులోకి రాకముందే అత్త ప్రాణాలను కోల్పోయింది. అనంతరం పోలీసులను ఆశ్రయించగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ షాకింగ్ ఘటన హైదరాబాద్ లో చోటుచేసకుంది. మియాపూర్ గోకుల్ ప్లాట్స్‌లో నివాసం ఉంటున్న హనుమంతరావు మాహేశ్వరి దంపతుల కుమార్తె డాక్టర్ శిరీష కు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన అజిత్ కుమార్‌తో వివాహం జరిగింది. ఉద్యోగరీత్యా ఈ ఇద్దరు లండన్‌లో స్థిరపడ్డారు. వీరిద్దరికి ఒక కుమార్తె కూడా ఉంది. అయితే, కొంతకాలం తర్వాత భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తడంతో ఆమె లండన్‌లోని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటినుంచి శిరీష అజిత్ కుమార్.. ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు.
ఈ క్రమంలో భార్యపై కోపం పెంచుకున్న భర్త అజిత్ కుమార్ ఆమెతోపాటు ఆమె కుటుంబ సభ్యులను సైతం హత్య చేయాలని భావించాడు. తన పగను తీర్చుకునేందుకు అజిత్.. తన వద్ద పనిచేసేటటువంటి వినోద్ కుమార్‌ను ఒప్పించాడు. వీరిద్దరికి మిత్రులైన హైదరాబాదులో ఉండే భవాని శంకర్, అశోక్ గోపీనాథ్ తో పాటు అజిత్ స్నేహితుడు శిరీషకు దగ్గర బంధువైన పూర్ణానందరావులతో కలిసి కుట్రను పన్నాడు. ఈ క్రమంలో శిరీష సోదరుడి వివాహానికి లండన్ నుంచి రావడంతో ఆమె కుమార్తె హైదరాబాద్ వెళ్లడాన్ని అవకాశంగా మలుచుకున్న అజిత్ అత్తారింటిపై నిఘా ఉంచాడు. అంతేకాకుండా వాచ్మెన్ కుమారుడు రమేష్ కు సైతం కొంత నగదు అప్పజెప్పి అత్తారింటి వద్ద కదలికలను అన్నింటిని తెలుసుకున్నాడు.
జూన్ 25న తెల్లవారుజామున ముగ్గురు వ్యక్తులు విషపు ఇంజక్షన్లతో శిరీష తల్లిదండ్రుల ఇంటికి వెళ్లగా హత్యాయత్నం విఫలమైంది. ఆ తర్వాత వాళ్ళ ప్లాన్ అంతా మార్చారు. ఎవరికీ తెలియకుండా ఇంట్లో వాడేటటువంటి మసాలా పొడులు పసుపు కారం లాంటి వాటిని డెలివరీ బాయ్ రూపంలో అందజేశారు. వాటిని వినియోగించడంతో ఆరుగురు తీవ్ర అస్వస్థతతకు గురయ్యారు. ఈ క్రమంలోనే శిరీష తల్లి ఉమామహేశ్వరి జూలై 5న మృతి చెందింది. అయితే, ఆమె అనారోగ్యమే కారణమని అంతా భావించారు. అయితే శిరీష తండ్రి సోదరుడు మరదలు బంధువైన మరో మహిళ కాళ్లు చేతులు స్పర్శ కోల్పోయి ఉండడంతో అనుమానం వచ్చి బ్లడ్ శాంపిల్స్ తీసి పరీక్షకు పంపారు. అందులో విష నమూనాలు ఉన్నట్లు వైద్యులు చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అయితే, ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు వాచ్మెన్ కుమారుడు రమేష్ ను అదుపులోకి తీసుకొని విచారించగా.. అదే అపార్ట్మెంట్లో శిరీష ప్లాట్ పైన ఉండే పూర్ణానందరావు పేరు వెల్లడించాడు. దాంతో మొత్తం వ్యవహారం అంతా బహిర్గతం అయింది. కుట్ర అమలుకు సహకరించిన ఆరుగురిని శుక్రవారం వేరు వేరు ప్రాంతాల్లో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే లండన్‌లో ఉన్న ప్రధాన నిందితుడు అజిత్ కుమార్‌ను సైతం అరెస్టు చేస్తామని పోలీసులు వెల్లడించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..