Hyderabad: ఇక నీళ్లు వృథా చేసే వారికి దబిడి దిబిడే.. రంగంలోకి వాటర్ వారియర్స్..
హైదరాబాద్‌లో తాగునీటిని ఇష్టారాజ్యంగా వృథా చేస్తే ఇకపై చర్యలు తప్పవు.. జలమండలి తీసుకొచ్చిన PAANI యాప్‌తో సామాన్య ప్రజలే అధికారులుగా మారి దుర్వినియోగాన్ని అడ్డుకుంటున్నారు. ఇప్పటికే 437 మంది వాటర్ వారియర్లుగా రంగంలోకి దిగగా, ముంచుకొస్తున్న ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో ప్రతి ఇంట్లో 20 శాతం నీటిని పొదుపు చేయాలంటూ జలమండలి పిలుపునిచ్చింది.

మహానగరంలో అమూల్యమైన తాగునీటి వృథా, దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు వినూత్న ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నీటి సంరక్షణలో సామాన్య పౌరులను భాగస్వాములను చేసే లక్ష్యంతో ప్రవేశపెట్టిన PAANI మొబైల్ యాప్‌కు నగరవాసుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. తాగునీటి రక్షణ కోసం ఇప్పటివరకు నగరవ్యాప్తంగా 437 మంది స్వచ్ఛందంగా జలమండలి పోర్టల్‌లో వాటర్ వారియర్లుగా తమ పేర్లను నమోదు చేసుకున్నారు. నగరంలో నీటి సంరక్షణపై ఆసక్తి, బాధ్యత ఉన్న ప్రతి పౌరుడూ వాటర్ వారియర్‌గా మారవచ్చని జలమండలి స్పష్టం చేసింది. వాలంటీర్లుగా నమోదు చేసుకున్న వారు గూగుల్ ప్లే స్టోర్ నుంచి PAANI యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని, తమ పరిసర ప్రాంతాల్లో జరిగే తాగునీటి దుర్వినియోగాన్ని ఫొటోలు, వివరాలతో నేరుగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావచ్చు. ముఖ్యంగా నల్లా నీటితో వాహనాలు కడగడం, హోస్పైపులతో ఫ్లోర్లు క్లీన్ చేయడం, ఓవర్‌హెడ్ ట్యాంకులు నిండి రోడ్లపై పొంగిపొర్లడం, పైప్లైన్ల లీకేజీలు వంటి సమస్యలను ఈ యాప్ ద్వారా సులభంగా రిపోర్ట్ చేయవచ్చు.
గోప్యంగా వివరాలు.. నిబంధనల ప్రకారం చర్యలు
వాటర్ వారియర్లు పంపిన ఫిర్యాదులను క్షేత్రస్థాయి ఇంజినీరింగ్ అధికారులు వెంటనే పరిశీలిస్తారు. నీటి దుర్వినియోగం జరిగినట్లు నిర్ధారణ అయితే నిబంధనల ప్రకారం నోటీసులు జారీ చేయడంతో పాటు చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటారు. అయితే ఫిర్యాదు చేసిన వారి వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ బయటపెట్టకుండా అత్యంత గోప్యంగా ఉంచుతామని జలమండలి హామీ ఇచ్చింది.
ముంచుకొస్తున్న ఎల్‌నినో ప్రభావం.. 20 శాతం పొదుపు లక్ష్యం
రాబోయే రోజుల్లో ఎదురయ్యే ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తాగునీటి సంరక్షణకు ప్రతి ఒక్కరూ అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని జలమండలి విజ్ఞప్తి చేసింది. ప్రతి కుటుంబం తమ రోజువారీ వినియోగంలో కనీసం 20 శాతం నీటిని పొదుపు చేయాలని పిలుపునిచ్చింది. ఇంట్లో చిన్నపాటి లీకేజీలను సైతం వెంటనే అరికట్టాలని, తాగునీటిని ఇతరత్రా అవసరాలకు వినియోగించవద్దని సూచించింది.
నగరంలోని ప్రతి కాలనీ, రెసిడెన్షియల్ అపార్ట్మెంట్, గేటెడ్ కమ్యూనిటీల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు వాటర్ వారియర్లుగా ముందుకు రావాలని అధికారులు కోరారు. నీటి సంరక్షణను ప్రజా ఉద్యమంగా మలచడమే లక్ష్యంగా జలమండలి అధికారిక వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియను నిరంతరం అందుబాటులో ఉంచింది.
