హైదరాబాద్, సెప్టెంబర్ 24: హైదరాబాద్ నగర వ్యాప్తంగా పలుచోట్లు మరికాసేపట్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే నగరమంతా దట్టమైన మబ్బులు కమ్మేశాయి. దీంతో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. చాలా ప్రాంతాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. అటు కరీంనగర్, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి జిల్లాల్లో కూడా 2-3 గంటల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశముందని స్పష్టం చేసింది.
ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలను ఆనుకొని వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన సంగతి తెలిసిందే. దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి సగటున 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆవర్తనం ప్రభావంతో ఈ రోజు ఉదయం నుంచే పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. అవసరమైతేతప్ప బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు.
కాగా తెలంగాణ రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఇప్పటికే హెచ్చరించింది కూడా. ఈ క్రమంలో మంగళవారం కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, నల్గొండ, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. బుధవారం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లు, గురువారం 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో అక్కడక్కడ గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే, పలుచోట్ల ఉరుములు, మెరుపులతో పాటు భారీగా ఈదురుగాలులతో వర్షాలు పడే సూచనలున్నాయని హెచ్చరించింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది.