హైదరాబాద్లో పాయా డిమాండ్ పరేషాన్ చేస్తోంది. చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో.. హైదరాబాద్ వాసులు వెచ్చదనం కోసం వేడి వేడి మటన్ పాయా కోసం ఎగబడుతున్నారు. ఆ డిమాండ్ ఎంతగా ఉందంటే హైదరాబాద్ సిటీతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లోనూ గొర్రెలు, పొట్టేళ్ల కాళ్లు సరిపడా దొరకకపోవడంలేదు. దీంతో మహరాష్ట్ర, నార్త్ ఇండియా నుంచి పాయాలను తీసుకొస్తున్నారు హోటల్స్ నిర్వాహకులు. చల్లటి చలిలో వేడివేడి మటన్ పాయా సూప్‌ను ఆస్వాదిస్తున్నారు. రుచితో పాటు, ఆరోగ్యానికి మంచిది కావడంతో సిటీలో పాయా డిమాండ్ పీక్స్‌కి చేరింది. దీంతో పాటు రెగ్యులర్‌గా బిర్యానీ, మటన్ గ్రేవీ తిని బోర్‌గా ఫీలవుతున్న వారు చల్లటి చలి వాతావరణంలో వెరైటీగా హాట్ హాట్.. స్పైసీ పాయా సూప్‌తో మజా చేయడానికి హోటల్స్ కి క్యూ కడుతున్నారు.
పాయా అంటే హైదరాబాదీలకు ఎంతిష్టమో చెప్పనక్కర్లేదు పొద్దున్నే పాయా-బన్ కాంబినేషన్ ఇక్కడ చాలా ఫేమస్. చాలా కేఫ్‌ల్లో దొరుకుతుంది. ఎనిమిది గంటల కల్లా అయిపోతుంది కూడా. సాయంత్రం పాయా నాన్ కాంబినేసన్‌కి నాన్ స్టాప్ సేల్ ఉంటుంది. తెలంగాణలో కాళ్ల షోర్వాను ఎంతో ఇష్టపడుతారు. దీని కోసం ఎక్కువ డబ్బులు వెచ్చించడానికి కూడా వెనుకాడడం లేదు పాయా ప్రియులు.
మేక, గొర్రె,పొట్టేళ్ల కాళ్లతో తయారు చేసే పులుసే ఈ పాయా లేదా కాళ్ల షోర్వా. కొంతమంది కోళ్లు, బీఫ్ ఎముకలను కూడా వాడతారు. ఎక్కువగా మటన్ పాయనే బాగా ప్రాచుర్యం పొందింది. చాలా వరకు పాయాను పొట్టేలు, మేక కాళ్లతో తయారు చేస్తారు. కాళ్లను కాల్చి గోధుమ పిండి సహాయంతో వాటి వెంట్రుకలను తొలగిస్తారు. తర్వాతా శుభ్రంగా కడుగుతారు. ఒక పాత్రలో కాళ్లను, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, మిర్యాలు, సొంటి, కొబ్బరి, ఇత ర మసాల దినులు వేసి నీళ్లు పోసి రెండు, మూడు గంటల పాటు మరిగిస్తారు. అనంతరం కారంపొడి, ఉప్పు, కావాల్సిన పదార్థాలు వేస్తారు. అధికంగా సూప్ ఉంచి అన్ని కలిసేదాక మరిగిస్తారు. దీంతో ఘుమఘుమలాడే పాయా సిద్ధమవుతుంది. పాయా తయారీ శ్రమతో కూడుకున్న పనే.. అయితే, దానికున్న రుచి మరే నాన్‌వెజ్ వంటకానికి రాదని చెబుతున్నారు తయారీ దారులు. పాయా హోటళ్లలో చాలా అరుదుగా లభిస్తుంది. దీనిని రుచిగా తయారు చేయాలంటే వంటకంలో అనుభవం ఉండాలి. అన్ని మసాలాలు కలిసి రుచిగా తయారు చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది.
ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయిన ఈ వంటకం నిజానికి చాలా పాతది. అప్పట్లో జలుబు, గొంతు నొప్పి, కాళ్లుచేతులు విరిగిన వాళ్లకు పాయా తాగమని పెద్దలు సలహా ఇచ్చేవారు. ఇప్పుడు దీని మీద చాలామంది డాక్టర్లు, శాస్త్రవేత్తలు, ఆహారనిపుణులు పరిశోధనలు చేసి, దీన్ని మరో అమృతంగా అభివర్ణించారు. పాయాలో కొలాజెన్ అనే ప్రొటీన్ విరివిగా ఉంటుంది. ఇది చర్మసౌందర్యాన్ని పెంచి పోషిస్తుంది. వివిధ రకాలైన ఖనిజాలు నొప్పి నివారణకు, గాయాలు తొందరగా మానడానికి, ఎముకలకు బలాన్నివ్వడానికి పనికి వస్తాయి.
ఇప్పుడు హైదరాబాద్లో ముఖ్యంగా ఓల్డ్ సిటీలో ఫేమస్ హోటల్స్ పాయా ప్రియులతో కళకళలాడుతున్నాయి. ఎముకలు కొరికే చలిలో హాట్ హాట్ పాయా కొరుకి తినడానికి ఉత్సాహం చూపిస్తున్నారు నాన్ వెజ్ ప్రియులు. అందుకే హైదరాబాద్‌లో కొందామంటే పాయా కోసం వాడే మేక, గొర్రె, పొట్టేళ్ల కాళ్లు దొరకడం లేదు. దీంతో డిమాండ్ మీట్ అవ్వడానికి పక్క రాష్ట్రాలైన మహరాష్ట్ర, కర్ణాటక, నార్త్ ఇండియా నుంచి పాయాలను తీసుకొస్తున్నారు. పాయాలకున్న ఈ డిమాండ్ వాతావరణంలో చలి తగ్గే వరకు అంటే మరో నెలరోజుల పాటు తగ్గేలా కనిపించడం లేదు.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..