పాలకు జీఎస్టీ (GST) సెగ తగిలింది. ఈ కారణంగా పాల ధరలు పెరిగాయి. ఈ మేరకు లీటర్‌కు రెండు రూపాయలు పెంచుతూ అమూల్, మదర్ డెయిరీ కంపెనీలు నిర్ణయించాయి. పెరిగిన ధరలు మంగళవారం నుంచే అమలులోకి వచ్చాయి. అమూల్ (Amul), మదర్ డెయిరీ (Mother Dairy) బ్రాండ్ కింద విక్రయించే అన్ని రకాల పాల ధరలు పెరిగాయి. ఈ మేరకు గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ ప్రకటన విడుదల చేసింది. పాల సేకరణ ధర, ఇతర ఖర్చులు పెరగడంతో పాల ధర పెంచక తప్పడం లేదని మదర్ డెయిరీ వెల్లడించింది. ఏ కారణం అయినప్పటికీ GST ఎఫెక్ట్ పాల ధరలపై పడిందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇన్నాళ్లూ కొన్ని ఆహార పదార్థాలు, పాల ఉత్పత్తులపై మినహాయింపులు ఉండేవి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జరిగిన జీఎస్‌టీ కౌన్సిల్ 47వ సమావేశంలో ఆ మినహాయింపుల్ని తొలగించారు. పెరుగు, లస్సీ లాంటి పాల ఉత్పత్తులపై 5 శాతం GST విధించారు. దీంతో డెయిరీలు ధరలు పెంచి ఆ భారాన్ని ప్రజలపై వేస్తున్నాయి. అంతే కాకుండా నిత్యావసరాలు, పెట్రోల్ ధరలు పెరగడంతో ఆ ఎఫెక్ట్ పాల ధరపై పడింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో రేట్లు పెంచాల్సి వచ్చిందని సంస్థలు చెబుతున్నాయి.
కాగా.. ప్రి-ప్యాక్డ్, ప్రి-లేబుల్డ్ పెరుగు, లస్సీ, మజ్జిగ వంటి పాల పదార్థాలపై జీఎస్టీ విధిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. తద్వారా పాలతో తయారు చేసిన ఉత్పత్తుల ధరలు పెరగాయి. కేంద్ర ప్రభుత్వం వీటిపై 5 శాతం జీఎస్‌టీ విధించడంతో డెయిరీ కంపెనీలు ధరలు పెంచాయి. అంతే కాకుండా ఐస్‌క్రీమ్, చీజ్, నెయ్యి, పన్నీర్ వంటి వాటిపై ఇదివరకే జీఎస్‌టీ ఉంది. పెరుగు, లస్సీపై జీఎస్‌టీ విధిస్తే ఇక పాల ఉత్పత్తులన్నీ జీఎస్‌టీ పరిధిలోకి వస్తాయి. అయితే ప్యాకేజ్డ్ పాలపై జీఎస్‌టీ లేకపోవడం కాస్త ఉపశమనం కలిగిస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం