Hyderabad: క్యాబా.. కోర్టా..? మా డాడీ ఎవరో తెలుసా అంటే కుదరదు.. మందుబాబులకు సీపీ సజ్జనార్ మాస్ వార్నింగ్

వాస్తవానికి కొత్త సంవత్సరం వస్తోందంటే చాలు.. నగరంలో జోష్ ఎంత ఉంటుందో, పోలీసుల పహారా అంతకు మించి ఉంటుంది. అయితే, ఎప్పుడూ లాఠీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులతో సీరియస్‌గా ఉండే పోలీసులు.. ఈసారి పంథా మార్చారు. లాఠీ దెబ్బల కంటే మాటల తూటాలే బలంగా పనిచేస్తాయని భావించారో ఏమో గానీ, హైదరాబాద్ పోలీసులు సోషల్ మీడియా వేదికగా వినూత్న ప్రచారానికి తెరలేపారు.

Hyderabad: క్యాబా.. కోర్టా..? మా డాడీ ఎవరో తెలుసా అంటే కుదరదు.. మందుబాబులకు సీపీ సజ్జనార్ మాస్ వార్నింగ్
Hyderabad CP VC Sajjnar New Year Warning

Updated on: Dec 28, 2025 | 4:59 PM

హైదరాబాద్ నగరం అంతటా న్యూఇయర్ జోష్ నెలకొంది.. డిసెంబర్ 31వ తేదీ నాడు.. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ఇప్పటికే చాలా మంది ప్రిపేర్ చేసుకుంటున్నారు.. ఈ క్రమంలో న్యూఈయర్ సెలబ్రేషన్స్ వేళ నగరంలో మద్యం తాగి వాహనాలు నడిపే మందుబాబులకు, ఆకతాయిలకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ దిమ్మతిరిగే వార్నింగ్ ఇచ్చారు. డిసెంబర్ 31 రాత్రి పార్టీల పేరుతో హద్దులు మీరితే కఠిన చర్యలు తప్పవని.. వేడుకలను చేదు జ్ఞాపకాలుగా మిగిలిపోకుండా జాగ్రతగా ఉండాలంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ‘క్యాబ్’ ఎక్కుతారా.. ‘కోర్టు’ మెట్లెక్కుతారా? అంటూ సజ్జనార్ ప్రశ్నించారు.. దీనికి సంబంధించిన ట్వీట్ లు నెట్టింట వైరల్ అయ్యాయి. హైదరాబాద్ పోలీస్ క‌మిష‌న‌ర్ వీసీ సజ్జనర్ తన ఎక్స్ ఖాతాలో చేసిన మూడు వేర్వేరు ట్వీట్లు ఇప్పుడు మందుబాబుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూన్నాయి.. అలాగే.. జాగ్రత్త అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నాయి..

‘లాయర్’ను వెతకడం కంటే.. గూగుల్‌లో ‘క్యాబ్’ను వెతకడం మిన్న!

సాధారణ హెచ్చరికలకు భిన్నంగా, పక్కా హైదరాబాదీ యాసలో సీపీ స‌జ్జన‌ర్ చేసిన ట్వీట్ యువతను ఆకర్షిస్తోంది. “మియా.. డ్రింక్ చేశావా? అయితే స్టీరింగ్‌కు సలాం కొట్టి క్యాబ్ ఎక్కు” అంటూ స్నేహపూర్వకంగా చెబుతూనే.. “గూగుల్‌లో లాయర్ కోసం వెతకడం కంటే, క్యాబ్ కోసం వెతకడం మంచిది” అని చురకలంటించారు. చలాన్లు, జైలు శిక్షలకు అయ్యే ఖర్చుతో పోలిస్తే క్యాబ్ ఖర్చు చాలా తక్కువని, సంబరాలను బాధ్యతయుతంగా జరుపుకోవాలని హితవు పలికారు. లేదంటే ‘యాక్షన్ గ్యారెంటీ’ అని తేల్చిచెప్పారు.

సజ్జనార్ ట్వీట్..

‘మా డాడీ ఎవరో తెలుసా?’ అంటే.. ఇక కుదరదు!

డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడగానే చాలామంది యువకులు పోలీసుల మీద ప్రతాపం చూపిస్తుంటారు. “మా డాడీ ఎవరో తెలుసా? మా అంకుల్ ఎవరో తెలుసా?” అంటూ పరపతిని వాడే ప్రయత్నం చేస్తుంటారు. దీనికి సీపీ సజ్జనర్ తనదైన శైలిలో చెక్ పెట్టారు. “మీ పరపతి గురించి మా ఆఫీసర్లను అడగొద్దు.. మీ ప్రైవసీని మేము గౌరవిస్తాం.. వాహనం పక్కన పెట్టి, డేట్ వచ్చాక కోర్టులోనే పరిచయం చేసుకుందాం” అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పరపతి ఎంత ఉన్నా, చట్టం ముందు అందరూ సమానమేనని, తాగి బండి నడిపితే ‘జీరో టాలరెన్స్’ (Zero Tolerance) మాత్రమే ఉంటుందని ఈ ట్వీట్ ద్వారా స్పష్టం చేశారు.

వినూత్న అవగాహనపై నెటిజన్ల ప్రశంసలు

కేవలం జరిమానాలతో భయపెట్టడమే కాకుండా, ఇలా హాస్యం, వ్యంగ్యం మేళవించి యువతకు అర్థమయ్యే రీతిలో అవగాహన కల్పిస్తున్న పోలీసుల తీరుపై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది. సీపీ సజ్జనర్ చేసిన ఈ ట్వీట్లు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. మొత్తానికి న్యూ ఇయర్ వేళ మందుబాబులు ఒళ్లు దగ్గర పెట్టుకోకపోతే.. కొత్త సంవత్సరం కోర్టు మెట్లెక్కాల్సి వస్తుందని స‌జ్జ‌న‌ర్ త‌నదైన శైలిలో గట్టిగానే హెచ్చరించార‌ని నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..