
హైదరాబాద్ ప్రజలకు శుభవార్త. నగరంలో ఇప్పటికే అనేక భారీ ఫ్లైఓవర్లు ఉండగా.. మరికొన్ని ఫ్లైఓవర్ల నిర్మాణం శరవేగంగా జరుగతోంది. ఈ క్రమంలో నగరంలో మరో ఫ్లైఓవర్ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ రానుంది. ఈ విషయాన్ని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. శనివారం హయత్ నగర్‌లోని ఓల్డ్ నేషనల్ హైవే సాయిబాబా టెంపుల్ నుంచి జీస్కూల్ వరకు రూ.10 కోట్లతో నిర్మించిన 4 లైన్ల రోడ్డు విస్తరణ పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నగరంలో డబుల్ డెక్క్ ఫ్లైఓవర్‌పై కీలక ప్రకటన జారీ చేశారు.
మహారాష్ట్రలోని నాగ్‌పూర్ తరహాలో హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్‌పై కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఎల్బీ నగర్ నుంచి హయత్‌నగర్ వరకు ఈ ఫ్లైఓవర్ ఉంటుందని తెలిపారు. త్వరలోనే కేంద్ర ప్రభుత్వం నుంచి దీనికి అనుమతి వస్తుందని చెప్పారు. కేంద్రం నుంచి అనుమతి రాగానే ఫ్లైఓవర్‌కు శంకుస్థాపన చేస్తామని స్పష్టం చేశారు. ఈ ఫ్లైఓవర్ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద రూ.200 కోట్లు ఇస్తుందని క్లారిటీ ఇచ్చారు. దీంతో పాటు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరో శుభవార్త కూడా అందించారు. హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్, ఇంజాపూర్, కొహెడ పండ్ల మార్కెట్ ప్రాంతాల్లో అన్ని రోడ్లను నాలుగు లైన్ల రహదారులుగా మారుస్తామని చెప్పారు. ఇక హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు సర్వీస్ రోడ్లను రూ.10 వేల కోట్లతో అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు పేర్కొన్నారు.
డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్‌తో హైదరాబాద్ రూపురేఖలే మారనున్నయని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. అటు టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్, రాష్ట్ర రోడ్డు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రి కోమటిరెడ్డి పట్టువదలకుండా డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ సాధించారని ప్రశంసలు కురిపించారు. రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోయినవారిని ఆదుకుంటామని, వారికి పరిహారం చెల్లిస్తామని స్పష్టతిచ్చారు. భూమి కోల్పోయినవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. హైదరాబాద్‌లో ఇప్పటికే పలు ఫ్లైఓవర్ల నిర్మాణం జరుగుతుందని, వీటి రాకతో ట్రాఫిక్ రద్దీ భారీగా తగ్గతుందన్నారు. కాగా ఇటీవల నగరంలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఫ్లైఓవర్ల నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ ఆమోదం తెలిపింది. వీటికి టెండర్లను కూడా ఆహ్వనించింది. త్వరలోనే వీటి నిర్మాణం మొదలయ్యే అవకాశముంది.