
Hyderabad: హైదరాబాద్‌లో దీపావళి సంబరాలు విషాదకరంగా మారాయి. పండగ వేళ టపాసులు కాలుస్తూ పలువురు ప్రమాదాలకు గురయ్యారు. ముఖ్యంగా బాణసంచా పేలుళ్ల కారణంగా కళ్లకు గాయాలు కావడంతో బాధితులు ఆసుపత్రుల బాట పట్టారు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు పలువురు ఈ ప్రమాదాల బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది.
మెహిదీపట్నంలోని ప్రభుత్వ సరోజినీదేవి కంటి ఆసుపత్రికి బాణసంచా కారణంగా కంటి గాయాలైన బాధితులు వచ్చారు. అయితే ఈ ఏడాది నవంబర్ 8న వెలువడిన తాజా నివేదిక ప్రకారం, ఒక్క సరోజినీదేవి ఆసుపత్రిలోనే 32 మంది కంటి గాయాలతో చికిత్స కోసం వచ్చారు. వారిలో ఆరుగురిని ఆసుపత్రిలో చేర్చగా, నలుగురు చిన్నారులు ఉన్నారు. మిగిలిన 26 మందికి వైద్యులు చికిత్స అందించి, తదుపరి పరీక్షల కోసం రావాలని సూచించారు. వీరిలో ఒకరు కుడి కంటిచూపును పూర్తిగా కోల్పోయినట్లు ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు.
దీపావళి సందర్భంగా బాణసంచా ప్రమాదాలు జరిగే అవకాశం ఉండటంతో సరోజినీదేవి కంటి ఆసుపత్రి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. మొత్తం 550 పడకల సామర్థ్యం ఉన్న ఈ ఆసుపత్రిలో బాణసంచా బాధితుల కోసం ప్రత్యేకంగా 20 పడకలను సిద్ధం చేశారు. వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందిని అందుబాటులో ఉంచడంతో పాటు అత్యవసర పరిస్థితుల్లో బాధితులను ఆసుపత్రికి తరలించేందుకు అంబులెన్సులను కూడా సిద్ధంగా ఉంచారు.
దీపావళి సమయంలో బాణసంచా కారణంగా కంటి గాయాలు కావడం ప్రతి ఏడాది ఆందోళన కలిగిస్తోంది. సరోజినీదేవి ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలిపిన వివరాల ప్రకారం, గత రెండు దీపావళి సీజన్లలో వరుసగా 116, 115 మంది బాణసంచా గాయాలతో ఆసుపత్రికి వచ్చారు.
ముఖ్యంగా కంటి గాయాలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. చిన్న గాయం అనుకున్నా ఆలస్యం చేయకుండా కంటి వైద్యుడిని సంప్రదించడం మంచిది.
ఇది కూడా చదవండి: Indian Railways: మన దేశంలో ఈ రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణిస్తున్నారా? వీసా, పాస్‌పోర్ట్ ఉంటేనే ప్రయాణం!
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి