Indiramma Towers: ఇందిరమ్మ ఫ్లాట్లపై బిగ్‌ అప్‌డేట్.. నేడే శంకుస్థాపన.. హైదరాబాద్‌లో ఈ ఏరియాల్లోనే!

ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద హైదరాబాద్‌ క్యూర్ పరిధిలో ప్రభుత్వం అందించబోయే ఇందిరమ్మ ఫ్లాట్ల కోసం ఎదరుచూస్తున్న వారికి అదిరిపోయే శుభవార్త. ఇవాళే ఈ ఇందిరమ్మ టవర్స్‌కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. మొత్తం లక్ష ఫ్లాట్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం.. CURE పరిధిలో 12 వేల ఫ్లాట్ల నిర్మాణాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపడుతోంది

Indiramma Towers: ఇందిరమ్మ ఫ్లాట్లపై బిగ్‌ అప్‌డేట్.. నేడే శంకుస్థాపన.. హైదరాబాద్‌లో ఈ ఏరియాల్లోనే!
Cm Revanth To Inaugurate Indiramma Towers Today

Edited By:

Updated on: Aug 13, 2026 | 9:54 AM

హైదరాబాద్‌: నగరంలో పేద, మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి సౌకర్యం కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల టవర్స్‌ నిర్మాణానికి నేడు శ్రీకారం చుట్టనున్నారు. కేపీహెచ్‌బీ కాలనీలో సీఎం రేవంత్‌రెడ్డి ఇందిరమ్మ ఇండ్ల టవర్స్‌కు భూమిపూజ చేయనున్నారు. హైదరాబాద్‌ పరిధిలో మొత్తం లక్ష ఫ్లాట్ల నిర్మాణాన్ని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. CURE పరిధిలో 12 వేల ఫ్లాట్ల నిర్మాణాన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం చేపడుతోంది. ఇందులో భాగంగా తొలి దశలో 18 ప్రాంతాల్లో 7,340 ఫ్లాట్లను నిర్మించేందుకు సిద్ధమైంది. హైదరాబాద్‌లోని 16 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈ ప్రాజెక్టులను నిర్మించబోతున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.807.40 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది.

ఒక్కో ఫ్లాట్‌కు రూ.5 లక్షల సబ్సిడీ

ఈ పథకం కింద ఇందిరమ్మ ఫ్లాట్లలో ఒక్కో యూనిట్‌కు ప్రభుత్వం రూ.5 లక్షల సబ్సిడీ ఇవ్వనుంది. అంటే మోత్తం ఫ్లాట్ నిర్మాణారికి రూ.11లక్షలు కాగా.. లబ్ధిదారుడి వాటా రూ.6 లక్షలుగా నిర్ణయించారు. ఒక్కో ఫ్లాట్‌లో 400 చదరపు అడుగుల కార్పెట్ ఏరియా, 528 చదరపు అడుగుల బిల్టప్ ఏరియా ఉండేలా నిర్మాణం చేపట్టనున్నారు.

వీరు మాత్రమే అర్హులు

ఈ ఇందిరమ్మ ఫ్లాట్లను పొందాలి అంటే లబ్ధిదారుడి కుటుంబ వార్షిక ఆదాయం రూ.6 లక్షలు దాటకూడదు. అలాగే దరఖాస్తుదారుడికి CURE పరిధిలో ఎలాంటి సొంత ఇల్లు, స్థలం లేదా ఫ్లాట్ ఉండకూడదు. ఒక ఫ్యామిలీకి కేవలం ఒక ఫ్లాట్ మాత్రమే కేటాయిస్తారు. దరఖాస్తుదారు ప్రస్తుతం నివసిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ప్రాజెక్టుకే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఆగస్ట్‌ 15తో ముగియనున్న గుడవు

ఇందిరమ్మ ఫ్లాట్ల కోసం దరఖాస్తుల స్వీకరణకు ఆగస్టు 15 చివరి తేదీగా నిర్ణయించారు. అర్హతలను పరిశీలించిన అనంతరం లాటరీ విధానంలో ఫ్లాట్లను కేటాయిస్తారు. దరఖాస్తు సమయంలో సర్టిఫికెట్లు సమర్పించాల్సిన అవసరం లేదు. రూ.100 దరఖాస్తు ఫీజుతో పాటు రూ.10 వేల టోకెన్ అడ్వాన్స్ చెల్లించాలి. ఫ్లాట్ కేటాయింపు జరగకపోతే ఈ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు. ఫ్లాట్ కేటాయిస్తే లబ్ధిదారుడి వాటాలో సర్దుబాటు చేస్తారు.

మహిళలకు 30 శాతం రిజర్వేషన్

ఫ్లాట్ల కేటాయింపులో వివిధ వర్గాలకు రిజర్వేషన్లు అమలు చేయనున్నారు. ఎస్సీలకు 14 శాతం, ఎస్టీలకు 5 శాతం, బీసీలకు 16 శాతం, దివ్యాంగులకు 5 శాతం కేటాయించనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఔట్‌సోర్సింగ్, క్లాస్-4 ఉద్యోగులు, పారిశుధ్య కార్మికులకు 10 శాతం రిజర్వేషన్ ఉంటుంది. మిగిలిన 50 శాతం ఫ్లాట్లు జనరల్ కేటగిరీకి కేటాయించనున్నారు. అన్ని కేటగిరీల్లో కలిపి 30 శాతం ఫ్లాట్లను మహిళలకు రిజర్వ్ చేయనున్నారు.

విడతల వారీగా లబ్ధిదారుడి వాటా

ఫ్లాట్ నిర్మాణ పురోగతికి అనుగుణంగా లబ్ధిదారుడు తన వాటాను చెల్లించాల్సి ఉంటుంది. ప్రొవిజనల్ అలాట్‌మెంట్ సమయంలో రూ.లక్ష, ఆర్సీసీ నిర్మాణం పూర్తయిన తర్వాత రూ.2 లక్షలు, ఫినిషింగ్ దశలో మరో రూ.2 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని ఫ్లాట్ అప్పగించే సమయంలో చెల్లిస్తే సరిపోతుంది.

హైదరాబాద్‌లో నిర్మించబోయే ఇందిరమ్మ టవర్స్ లిస్ట్

ముఖ్యమంత్రి భూమిపూజ చేయనున్న కేపీహెచ్‌బీ కాలనీలో 480 ఫ్లాట్ల నిర్మాణానికి ప్రతిపాదించారు. మల్కాజిగిరి కౌకూర్, శేరిలింగంపల్లి రాయదుర్గం, మహేశ్వరం జల్‌పల్లి, నాంపల్లి రెడ్‌హిల్స్, నీలోఫర్ సైట్ ప్రాంతాల్లోనూ నిర్మాణాలు చేపట్టనున్నారు. సనత్‌నగర్ పాటిగడ్డ, మలక్‌పేట గడ్డిఅన్నారం, ఇబ్రహీంపట్నం బండ్లగూడ, మేడ్చల్ పోచారం, రాజేంద్రనగర్ మైలార్‌దేవ్‌పల్లి, కుత్బుల్లాపూర్ గాజులరామారం ప్రాంతాల్లో కూడా ఇందిరమ్మ ఇండ్ల టవర్స్‌ నిర్మించనున్నారు. ఖైరతాబాద్ హకీంపేట్ దర్గా, జూబ్లీహిల్స్, అంబర్‌పేట సిటీ పోలీస్ లైన్స్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోయిన్‌పల్లి, కార్వాన్ కుల్సుంపురా పోలీస్ క్వార్టర్స్‌లోనూ ప్రాజెక్టులు ప్రతిపాదించారు.

దరఖాస్తుకు పలు మార్గాలు

ఇందిరమ్మ ఫ్లాట్ల కోసం మీ సేవా కేంద్రాలతో పాటు అధికారిక మీ సేవ వెబ్‌సైట్‌, మీ సేవ వాట్సాప్ సేవ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. అర్హతల పరిశీలన పూర్తయిన తర్వాత లాటరీ ద్వారా తుది లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us