
హైదరాబాద్ వేదికగా జరుగుతున్న బ్రిక్స్ అవినీతి నిరోధక వర్కింగ్ గ్రూప్ (ACWG) సమావేశానికి భారత ప్రభుత్వ సిబ్బంది, శిక్షణ విభాగం కార్యదర్శి రచనా షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సుస్థిర అభివృద్ధికి అవినీతి అతిపెద్ద ఆటంకమని, పాఠశాలలు, ఆసుపత్రులు, కీలక మౌలిక వసతులకు చేరాల్సిన ప్రజా వనరులను అవినీతి పక్కదారి పట్టిస్తుందని, ఇది ప్రభుత్వాలపై ప్రజలకు ఉండే విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అవినీతి అనే సవాలును ఏ ఒక్క దేశమూ ఒంటరిగా ఎదుర్కోలేదని, సరిహద్దు దాటే అక్రమ ఆర్థిక మళ్లింపులను అరికట్టేందుకు అంతర్జాతీయ స్థాయిలో నిరంతర సమన్వయం అత్యంత ఆవశ్యకమని పిలుపునిచ్చారు.
అలాగే పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తులకు ఏ దేశమూ ఆశ్రయం ఇవ్వకూడదని రచనా షా స్పష్టం చేశారు. నిందితుల అప్పగింత, దొంగిలించిన ఆస్తుల స్వాధీనం కోసం బ్రిక్స్ రిపాజిటరీ, బ్రిక్స్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ప్రాక్టీషనర్ల నెట్‌వర్క్ మధ్య భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేయాలని కోరారు. ప్రత్యక్ష, వేగవంతమైన సమాచార మార్పిడి కోసం రూపొందించిన ప్రామాణిక టెంప్లేట్, నోడల్ పాయింట్లు, నిపుణుల డైరెక్టరీతో చట్టాన్ని అమలు చేసే సంస్థల మధ్య ఆచరణాత్మక సహకారం పెరుగుతుందని అన్నారు.
అధికారుల విచక్షణాధికారాలను పరిమితం చేస్తూ డిజిటల్ గుర్తింపు, ఇ-సేవలు, డిజిటల్ చెల్లింపులు అవినీతిని అరికడతాయని వివరించారు. భారత ప్రభుత్వ ఇ-మార్కెట్‌ప్లేస్ (GeM), ప్రత్యక్ష నగదు బదిలీ (DBT), ముఖ రహిత-కాగిత రహిత పన్నుల విధానాలను సాంకేతికత సంస్కరణలకు నిదర్శనంగా పేర్కొన్నారు.
రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో భాగంగా ‘ఆస్తుల రికవరీపై బ్రిక్స్ నిపుణుల నెట్‌వర్క్’ సమావేశంతో పాటు ‘నవకల్పనలు – సాంకేతికత ద్వారా నైతిక పాలన’ పై ప్రత్యేక సమాంతర కార్యక్రమం నిర్వహించనున్నారు. అంతేకాకుండా, ఆర్థిక సాంకేతికత, వర్చువల్ డిజిటల్ అసెట్స్ దుర్వినియోగం ద్వారా జరిగే మనీ లాండరింగ్, అవినీతి సొమ్ము మళ్లింపులను అరికట్టే అంశాలపై ప్రత్యేక సెషన్లలో ప్రతినిధులు లోతుగా చర్చించనున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.