
కరోనా వ్యాక్సిన్‌ను తయారుచేసి ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ మరో ఘనత సాధించేందుకు సిద్దమవుతోంది. లక్షల మంది ప్రాణాలను బలిగొంటున్న మరో వ్యాధికి వ్యాక్సిన్ తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ప్రతీ ఏటా క్షయ వ్యాధితో లక్షల మంది మరణిస్తున్నారు. వీరిని కాపాడేందుకు వ్యాక్సిన్‌ను గత కొంతకాలంగా భారత్ బయోటెక్ అభివృద్ది చేస్తోంది. ఇందుకోసం బయోఫ్యాబ్రి అనే సంస్థతో కలిసి పనిచేస్తోంది. క్షయ వ్యాధిని నివారించేందుకు ఎంటీబీవ్యాక్ అనే వ్యాక్సిన్‌ను అభివృద్ది చేస్తున్నారు. ఇండియాలో దీనిని తయారుచేయడానికి అంతర్జాతీయ కంపెనీ అయిన బయోఫ్యాబ్రీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ సంస్థ సహాయంతో భారత్‌లో ఎంటీబీవ్యాక్ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయనుంది. గత మూడేళ్లుగా వ్యాక్సిన్‌ను తయారుచేసే పనులు జరుగుతోండగా.. ఇప్పటికే రెండు దశల క్లినికల్ ట్రయల్స్ పూర్తయ్యాయి. త్వరలో మూడో దశ క్లినికల్ ట్రయల్స్ చేపట్టనున్నారు.
క్లీనికల్ ట్రయల్స్ ప్రక్రియ ముగిస్తే మార్కెట్లోకి ఈ వ్యాక్సిన్‌ను భారత్ బయోటెక్ విడుదల చేయనుంది. వ్యాక్సిన్ తయారీకి అవసరమైన టెక్నికల్ నాలెడ్జ్, ఇతర విషయాల్లో బయోఫ్యాబ్రి సంస్థ భారత్ బయోటెక్ సంస్థకు సాయం అందిస్తోంది. ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే క్షయ వ్యాధిని నివారించవచ్చు. ఇండియాలో చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు లక్షల మంది క్షయ వ్యాధి బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే మరణాల సంఖ్య తగ్గే అవకాశముంది. ఇప్పటికే జరిగిన రెండు దశ క్లీనికల్ ట్రయల్స్‌లో ఈ వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేస్తుందని, ఇది సురక్షితమని తేలింది. ఇక మూడో దశ ట్రయల్స్ పూర్తయితే ఉత్పత్తి ప్రారంభం కానుంది. ప్రపంచవ్యాప్తంగా భారత్ బయోటెక్ సంస్థ వ్యాక్సిన్‌ను సరఫరా చేయనుంది.
చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరిలోనూ పనిచేసేలా ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ద చేశారు. ప్రపంచవ్యాప్తంగా వీలైనంత త్వరగా వ్యాక్సిన్‌ను సరఫరా చేసేందుకు భారత్ బయోటెక్ సంస్థతో చేసుకున్న ఒప్పందం ఉపయోగపడుతుందని బయోఫ్యాబ్రి సంస్థ చెబుతోంది. ఇండియాతో పాటు ఆఫ్రికా, ఆసియాలోని చాలా దేశాల్లో క్షయ వ్యాధి తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో ఈ దేశాలన్నింటికీ భారత్ బయోటెక్ ఎంటీబీవ్యాక్ వ్యాక్సిన్ సరఫరా చేయనుంది.