ACB Raids: కళ్లు చెదిరేలా డీఎస్పీ భీమ్‌రెడ్డి అక్రమాస్తులు

అవినీతి ఆరోపణలపై అరెస్టైన డీఎస్పీ భీమ్‌రెడ్డి కేసులో ఏసీబీ సోదాలు సంచలనం సృష్టించాయి. హైదరాబాద్‌తో పాటు తెలంగాణ, కర్ణాటకలో విస్తరించిన విల్లాలు, ఫ్లాట్లు, వ్యవసాయ భూములు, కమర్షియల్ ఆస్తులు, భారీ నగదు, బంగారం, వెండి వెలుగులోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు సుమారు 20 ప్రాంతాల్లో ఆస్తులను గుర్తించిన ఏసీబీ, తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయని వెల్లడించింది.

ACB Raids: కళ్లు చెదిరేలా డీఎస్పీ భీమ్‌రెడ్డి అక్రమాస్తులు
DSP Bheem Reddy

Edited By:

Updated on: Jul 02, 2026 | 8:30 PM

అవినీతి ఆరోపణలపై అరెస్టైన డీఎస్పీ భీమ్‌రెడ్డి నివాసాలు, అనుబంధ ప్రాంతాల్లో అవినీతి నిరోధక శాఖ నిర్వహించిన సోదాల్లో భారీ మొత్తంలో ఆస్తులు, నగదు, బంగారం, వెండి వెలుగులోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రాథమిక దర్యాప్తులో ఇప్పటివరకు సుమారు 20 ప్రాంతాల్లో స్థిర, చరాస్తులను గుర్తించినట్లు సమాచారం. సీబీ వివరాల ప్రకారం, గచ్చిబౌలి, నార్సింగిలో రెండు విల్లాలు, గచ్చిబౌలిలో జీ+2 నివాస భవనం, మరో ట్రిపుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ ఉన్నట్లు గుర్తించారు. ల్యాంకో హిల్స్‌లో కుమార్తె పేరుపై సుమారు 500 గజాల కమర్షియల్ ఆస్తి, మణికొండ మర్రిచెట్టు సెంటర్‌లో దాదాపు 3 వేల గజాల్లో కమర్షియల్ కాంప్లెక్స్‌ను గుర్తించినట్లు వెల్లడించారు. దేవిధంగా, తెల్లాపూర్‌లో రెండు రెసిడెన్షియల్ ఫ్లాట్లు, ప్రగతి రిసార్ట్స్ సమీపంలో 500 గజాల ఓపెన్ ప్లాట్, జహీరాబాద్‌లో మూడున్నర ఎకరాల వ్యవసాయ భూమి, కర్నాటకలో 44 ఎకరాల వ్యవసాయ భూమి, బెంగళూరులోని దేవనహళ్లిలో మరో ఎకరం స్థలం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నాగోల్‌లో కామినేని ఆస్పత్రి సమీపంలో ఒక ఫ్లాట్, పటాన్‌చెరులో సుమారు వెయ్యి గజాల విస్తీర్ణంలో రెండు ఓపెన్ ప్లాట్లు కూడా ఉన్నట్లు తెలిపారు. మోమిన్‌పేట్‌లో రెండు ఎకరాల విస్తీర్ణంలో ఫామ్‌హౌస్‌తో పాటు వెయ్యి గజాల స్థలంలో గెస్ట్‌హౌస్, ముచ్చింతల్ గ్రామంలో నాలుగున్నర ఎకరాల భూమి కూడా భీమ్‌రెడ్డి కుటుంబానికి అనుబంధంగా ఉన్నట్లు దర్యాప్తులో బయటపడినట్లు సమాచారం. అదనంగా ఒక మైనింగ్ కంపెనీలో రూ.75 లక్షల పెట్టుబడి భాగస్వామ్యం ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించినట్లు వెల్లడించారు.

సోదాల్లో రూ.50 లక్షలకు పైగా నగదు, సుమారు రెండు కిలోల బంగారం, 20 కిలోల వెండి, బ్యాంకు ఖాతాల్లో దాదాపు రూ.20 లక్షల నిల్వలను అధికారులు గుర్తించారు. అలాగే 23 విదేశీ మద్యం సీసాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అధికారుల ప్రకారం, ఇప్పటివరకు గుర్తించినవి ప్రాథమిక వివరాలే. ఇంకా రెండు నుంచి మూడు రోజుల పాటు తనిఖీలు కొనసాగనున్న నేపథ్యంలో అక్రమంగా సంపాదించిన ఆస్తుల అసలు విలువ మరింత పెరిగే అవకాశం ఉందని దర్యాప్తు వర్గాలు భావిస్తున్నాయి. అన్ని ఆస్తుల విలువ, వాటి మూలాలు, సంబంధిత పత్రాలపై సమగ్ర విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశముంది.

Loading...
Unable to load recommendations.
Follow Us