
ఆన్‌లైన్ బూచోళ్లున్నారు.. జర జాగ్రత్త.. బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నాం.. ఓటిపి చెప్పండి ప్లీజ్ అంటారు.. డిజిటల్ అరెస్ట్ అంటారు.. పెట్టుబడితో మీ డబుల్ డబుల్ అయితయ్ అంటారు.. పర్మినెంట్ ఉద్యోగం అంటారు.. తక్కువ ధరకే గోల్డ్ అంటారు.. బంపర్ ఆఫర్ అంటారు.. ఇలా ఏవేవో మాయ మాటలు చెబుతారు.. చివరకు బుట్టలో వేసుకోని.. లక్ష లక్షలు కాజేస్తారు.. ఇవన్నీ జస్ట్ ఉదాహరణకు మాత్రమే.. ఎన్నో సంఘటనలు మన కళ్ల ముందే జరుగుతుంటాయి.. దీనిపై పోలీసులు ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా.. అమాయకులు నమ్మి మోసపోవడం అనేది అలవాటుగా మారింది. ఎలాంటి కష్టం లేకుండా.. ఈజీగా డబ్బు వస్తుందంటే చాలు.. ఏది చెప్పినా వింటారు.. ఏది చేయమన్నా చేస్తారు.. చివరికి మోసపోయాం.. అంటూ లబోదిబోమంటారు.. తాజాగా.. హైదరాబాద్ నగరంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన 22 ఏళ్ల యువతి నకిలీ ఫ్లిప్‌కార్ట్ ఉద్యోగ వెబ్‌సైట్ ద్వారా 3 లక్షలకు పైగా పోగొట్టుకుంది. నకిలీ ఫ్లిప్‌కార్ట్ అనుబంధ పోర్టల్ ప్రతినిధులుగా నటిస్తూ మోసగాళ్లకు ఆమె రూ.3.56 లక్షలు చెల్లించింది. చిరవకు మోసపోయానని గ్రహించడంతో.. పోలీసులను సంప్రదించి తన గోడును వెళ్లబోసుకుంది.
హైదరాబాద్ మహిళకు ‘గ్లోబల్ ఆన్‌లైన్ జాబ్స్ ఫ్రమ్ ఫ్లిప్‌కార్ట్ ఇంటర్నెట్ ప్రైవేట్ లిమిటెడ్’ అనే ఖాతా నుంచి పార్ట్‌టైమ్ అవకాశాన్ని అందిస్తున్నట్లు వాట్సాప్ సందేశం వచ్చింది. ఆ సందేశంలో నామమాత్రపు రూ.200 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించమని ఓ సందేహాస్పద వెబ్‌సైట్ లింక్ ఉంది. దీంతో ఆమె 200లతో రిజిస్ట్రేషన్ అయింది.. కొద్దిసేపటికే, ఆమెకు రూ.100 “కమీషన్” వచ్చింది.. ఇది ఆమె నమ్మకాన్ని పొందడానికి సైబర్ చీటర్లు రూపొందించిన వ్యూహం అది..
తొలి చెల్లింపుతోనే ఆమె ప్రోత్సహం అందించినట్లయింది.. ఇది కాస్త ఆమె పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడానికి వ్యూహంగా మారింది. మొదట రూ. 1,000 పెట్టుబడి పెట్టగా.. రూ. 250 రాబడి వచ్చింది.. తరువాత అధిక లాభాల హామీతో రూ. 5,000 పెట్టుబడి పెట్టింది.. మళ్లీ లాభం వచ్చింది.
ఈ పథకం చట్టబద్ధమైనదిగా కనిపించేలా చేయడానికి, స్కామర్లు ఆమెను ఒక “VIP గ్రూప్”లో చేర్చారు.. అక్కడ తప్పుడు విశ్వసనీయతను సృష్టించడానికి ఆదాయాల కల్పిత స్క్రీన్‌షాట్‌లను షేర్ చేశారు. దీంతో.. నకిలీ ఫ్లిప్‌కార్ట్ ఉద్యోగ వెబ్‌సైట్‌కు హైదరాబాద్ మహిళ పలుసార్లు చెల్లింపులు చేసింది.. కాలక్రమేణా, బాధితురాలు బహుళ చెల్లింపులను బదిలీ చేసింది.. ఇలా మొత్తం చెల్లింపులు రూ.3,56,680కి చేరుకున్నాయి.
ఆమె తన సంపాదనను ఉపసంహరించుకోవడానికి ప్రయత్నించినప్పుడు.. సైబర్ నిందితులు ప్రాసెసింగ్ ఫీజు – ట్యాక్స్ ఫీజు కోసం అదనపు చెల్లింపులను డిమాండ్ చేశారు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన ఆమె హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఉద్యోగ ఆఫర్ వచ్చినప్పుడల్లా, అధికారిక కంపెనీ వెబ్‌సైట్‌లలో దాని ప్రామాణికతను తనిఖీ చేయండి. చట్టబద్ధమైన యజమానులు ఎప్పుడూ రిజిస్ట్రేషన్ ఫీజులు లేదా పెట్టుబడులు అడగరు కాబట్టి, ముందస్తు చెల్లింపులు ఎప్పుడూ చేయరు. తక్కువ శ్రమతో అధిక రాబడి అనేది ఏది ఉండదు.. ఆఫర్ల పట్ల ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండండి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..