Hyderabad: ఓఆర్‌ఆర్‌ వద్ద అనుమానాస్పదంగా వెళ్తున్న కారు.. ఆపి చూడగా గుప్పుమన్న ఘాటు వాసన!

మల్కాజ్‌గిరి పరిధిలో ఎస్‌ఓటీ పోలీసులు భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్‌లో ఇద్దరు అంతర్రాష్ట్ర స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. మార్చి 2 (సోమవారం) అబ్దుల్లాపూర్ మెట్ ఓఆర్ఆర్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో అనుమానాస్పదంగా వెళ్తున్న..

Hyderabad: ఓఆర్‌ఆర్‌ వద్ద అనుమానాస్పదంగా వెళ్తున్న కారు.. ఆపి చూడగా గుప్పుమన్న ఘాటు వాసన!
Drug Peddling Gangs Busted In Hyderabad

Edited By:

Updated on: Mar 02, 2026 | 9:33 PM

హైదరాబాద్, మార్చి 2: హైదరాబాద్ నగరంలో మళ్లీ గంజాయి అక్రమ రవాణా గుట్టు రట్టు అయింది. మల్కాజ్‌గిరి పరిధిలో ఎస్‌ఓటీ పోలీసులు భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్‌లో ఇద్దరు అంతర్రాష్ట్ర స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. మార్చి 2 (సోమవారం) అబ్దుల్లాపూర్ మెట్ ఓఆర్ఆర్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో అనుమానాస్పదంగా వెళ్తున్న ఒక కియా కారును ఆపి తనిఖీ చేయగా.. కారులో భారీగా గంజాయి నిల్వ ఉంచినట్టు గుర్తించారు. వెంటనే కారులో ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

నిందితులు ఒడిశాలోని గజపతి జిల్లాకు చెందిన నభిన్ సభర్, సుద్కర్ మండల్‌గా పోలీసులు గుర్తించారు. వీరు ఒడిశా నుంచి గంజాయిని తీసుకువచ్చి హైదరాబాద్ మీదుగా కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అయితే హైదరాబాద్ లో మాత్రం ఓఆర్ఆర్‌ కేంద్రంగా గంజాయి విక్రయాలు జరిపి వెంటనే మహారాష్ట్ర వెళ్ళిపోతునట్టు గుర్తించారు పోలీసులు. ఇక్కడి పెడ్లర్ లను ఓఆర్ఆర్‌ వద్ద కిలోల చొప్పున గంజాయి డెలివరీ చేస్తునట్టు పోలీసులు గుర్తించారు.

నిందితుల నుంచి మొత్తం164 కేజీల గంజాయి, అలాగే రవాణాకు ఉపయోగించిన కియా కారును స్వాధీనం చేసుకున్నారు. ఓఆర్ఆర్ వరకు అనుమానం రాకుండా కారులో గంజాయి తీసుకువచ్చి, అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు పంపిణీ చేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఘటనపై సంబంధిత పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ రవాణా నెట్‌వర్క్ వెనుక మరెవరైనా ఉన్నారా? ఇంకా ఎన్ని రాష్ట్రాలకు సరఫరా జరుగుతోంది? అనే కోణాల్లో పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు. నిందితులపై ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించారు. గతంలో వీరిపై కేసులు ఉన్నాయా అన్న అంశంపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. నగరంలో డ్రగ్స్ అక్రమ రవాణాపై పోలీసులు నిఘా మరింత కట్టుదిట్టం చేసిన నేపథ్యంలో ఇంత పెద్ద ఎత్తున పట్టుబడటం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us