
హైదరాబాద్: దొంగతనం చేయాలంటే ముందుగా రెక్కీ.. ఆ తర్వాత పక్కా ప్లాన్.. రాత్రి ఇంట్లోకి ఎంట్రీ.. దొరికిన సొత్తు తీసుకుని అక్కడి నుంచి పరార్..! సాధారణంగా దొంగల ప్లాన్ ఇలాగే ఉంటుంది. కానీ హైదరాబాద్ పాతబస్తీలో ఓ దొంగ మాత్రం చివరి స్టెప్‌లో బోల్తా పడ్డాడు. ఇంట్లోకి చొరబడి దొరికిన వస్తువులను దోచుకున్నాడు.. ఇక వెళ్లిపోవడమే మిగిలింది. కానీ రాత్రంతా కష్టపడ్డాం కదా.. కాసేపు విశ్రాంతి తీసుకుందాం” అనుకున్నాడో ఏమో.. అదే ఇంట్లో దిండు పెట్టుకుని హాయిగా నిద్రపోయాడు. తెల్లారేసరికి ఇంటి యజమానికి అడ్డంగా దొరికిపోయాడు.
ఉదయం ఇంటికి వచ్చి తలుపులు ఓపెన్ చేయగా.. ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తి బెడ్‌పై హాయిగా నిద్రపోతూ ఉండడాన్ని చూసిన ఇంటి యజమాని ఒక్కసారిగా షాక్‌కు అయ్యాడు. వెంటనే సెల్‌ఫోన్‌లో వీడియో రికార్డు చేయడం ప్రారంభించాడు. అనంతరం అతడిని నిద్రలేపి ఎవరు నువ్వు..? ఇంట్లోకి ఎందుకు వచ్చావు..? అంటూ ప్రశ్నించారు. ఇంటి యజమాని ప్రశ్నలకు సదరు వ్యక్తి ఇచ్చిన సమాధానం మరింత ఆశ్చర్యానికి గురిచేసింది. తాను దొంగతనం చేయడానికి వచ్చినట్లు, ఇంట్లో దొరికిన వస్తువులను తీసుకున్న తర్వాత కాస్త విశ్రాంతి తీసుకుని వెళ్లిపోదామని పడుకున్నట్లు అతను చెప్పినట్టు సమాచారం.
అయితే ఇందుకు సంబంధించిన వీడియోను సదురు ఓనర్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో ఈ వీడియో కాస్త వైరల్‌గా మారింది. నెట్టింట ఈ వీడియో చూసిన జనాలు తమదైన రీతిలో కామెంట్ చేస్తున్నారు.. దొంగతనం వరకు ప్లాన్ బాగానే వేశాడు.. కానీ నిద్రను మాత్రం ప్లాన్ చేయలేకపోయాడు అంటూ ఈ ఘటనపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. అయితే సదరు వ్యక్తి నిజంగా ఏయే వస్తువులు దొంగిలించాడు? అతడు మద్యం లేదా ఇతర మత్తు పదార్థాల ప్రభావంలో ఉన్నాడా? ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందిందా? అనే పూర్తి వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.