
హైదరాబాద్‌లోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం (మే 19) పట్టపగలు దారుణ సంఘటన చోటుచేసుకుంది. కవాడిగూడలోని రత్నదీప్ బిల్డింగ్ నాలుగో అంతస్తులో ఉన్న ఒక స్పా సెంటర్‌లో పనిచేస్తున్న మహిళను ఆమె భర్తే కత్తితో పొడిచి అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్‌కు చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
మృతురాలు బహదూర్ పురా కిషన్ బాగ్ ప్రాంతానికి చెందిన బంగి దేబోరా అనే మహిళగా గుర్తించారు. ఆమె కవాడిగూడలోని స్పా సెంటర్‌లో బ్యూటీషియన్‌గా విధులు నిర్వహిస్తోంది. గత కొంతకాలంగా దంపతుల మధ్య కుటుంబ కలహాలు నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం కూడా భార్యాభర్తల మధ్య తీవ్రమైన గొడవ జరిగింది. ఆ గొడవ తర్వాత దేబోరా యథావిధిగా తన విధులకు హాజరైంది.
కోపంతో రగిలిపోయిన భర్త, తన వెంట కత్తిని సిద్ధం చేసుకుని స్పా సెంటర్‌కు చేరుకున్నాడు. మరోసారి ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. అక్కడ విచక్షణ రహితంగా దేబోరాపై దాడి చేసి, కత్తితో పొడిచాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డ మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘాతుకానికి ఒడిగట్టిన అనంతరం నిందితుడు అక్కడి నుండి పరారయ్యాడు.
సమాచారం అందుకున్న గాంధీనగర్ పోలీసులు, క్లూస్ టీంతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. ప్రాథమికంగా మృతురాలి పేరు శ్వేత అని ప్రచారం జరిగినప్పటికీ, విచారణలో ఆమె పేరు బంగి దేబోరా అని స్పష్టమైంది. హత్య చేసిన తర్వాత నిందితుడు నేరుగా అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…