
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన పీహెచ్‌డీ విద్యార్థి సూర్య ప్రతాప్ భారతి (30) మృతి కేసులో హైదరాబాద్ జిల్లా వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ కీలక తీర్పు వెలువరించింది. వైద్యం నిర్లక్ష్యం కారణంగానే విద్యార్థి మరణించాడని తేల్చిన కమిషన్, నల్లగండ్లలోని సిటిజన్స్ స్పెషాలిటీ ఆస్పత్రి, న్యూరాలజిస్ట్ డాక్టర్ అపర్ణ విజయ్ కుమార్‌లను సంయుక్తంగా బాధ్యులుగా పేర్కొంటూ బాధిత కుటుంబానికి రూ.1 కోటి పరిహారం చెల్లించాలని ఆదేశించింది. జిల్లా వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ అధ్యక్షురాలు బి. ఉమా వెంకట సుబ్బలక్ష్మి, సభ్యులు సి. లక్ష్మీ ప్రసన్న, బి. రాజిరెడ్డి సభ్యులుగా ఉన్న ధర్మాసనం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. పరిహారంతో పాటు న్యాయపరమైన ఖర్చుల కింద రూ.50 వేలును కూడా చెల్లించాలని పేర్కొంది. 45 రోజులలోపు ఈ మొత్తాన్ని చెల్లించకపోతే, ఉత్తర్వులు అందిన తేదీ నుంచి వార్షికంగా 9 శాతం వడ్డీ వర్తిస్తుందని స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా, ఈ కేసులో ప్రత్యర్థులుగా ఉన్న మెడ్సిస్ పాత్‌ల్యాబ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, కాంటినెంటల్ ఆస్పత్రి, అక్కడి న్యూరాలజిస్ట్ డాక్టర్ కైలాస్ మిర్చేపై నమోదైన ఫిర్యాదులను కమిషన్ కొట్టివేసింది. కుటుంబ సభ్యుల తరఫున న్యాయవాది రాజశ్రీ మంచె తెలిపిన వివరాల ప్రకారం, 2020 ఆగస్టు 17న సూర్య ప్రతాప్ భారతి బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యారు. హాస్టల్ గదిలో అపస్మారక స్థితిలో ఉండగా స్నేహితులు వెంటనే యూనివర్సిటీ ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి సిటిజన్స్ ఆస్పత్రికి రిఫర్ చేశారు.
అయితే, ఆస్పత్రిలో చేర్చిన అనంతరం చికిత్స వివరాలు, ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులకు సరైన సమాచారం ఇవ్వలేదని వారు ఆరోపించారు. అంతేకాకుండా, కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారించామని చెప్పి ప్రత్యేక కోవిడ్ ఆస్పత్రికి తరలించాలని సూచించినట్లు తెలిపారు. దీంతో 2020 ఆగస్టు 19న భారతిను కాంటినెంటల్ ఆస్పత్రికి తరలించగా, అక్కడ నిర్వహించిన కోవిడ్ పరీక్షలో నెగటివ్ రావడంతో మరోసారి టెస్ట్ నిర్వహించారు వైద్యులూ.
అయితే అప్పుడు కూడా నెగటివ్‌గా తేలిందని స్నేహితులు వెల్లడించారు. అప్పటికే ఆయన పరిస్థితి విషమించి, బ్రెయిన్ డెడ్‌గా వైద్యులు ప్రకటించారు. చివరకు ఆగస్టు 21న గుండెపోటుతో సూర్య ప్రతాప్ భారతి మరణించారు. ఈ ఘటనపై విచారణ జరిపిన కమిషన్, సిటిజన్స్ ఆస్పత్రి, సంబంధిత వైద్యురాలు చికిత్సలో నిర్లక్ష్యం ప్రదర్శించారని నిర్ధారించి, బాధిత కుటుంబానికి భారీ పరిహారం చెల్లించాలని ఆదేశించింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.