టిప్‌టాప్‌గా రెడీ అయ్యాడు.. సూట్‌కేస్‌లతో బస్ ఎక్కాడు.. అనుమానం వచ్చి చెక్‌ చేయగా

ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా ఆర్టీసీ బస్సుల్లో గంజాయి తరలిస్తున్న ఓ వ్యక్తిని బ్చన్నపేట పోలీసులు అరెస్ట్ చేశారు. అనుమానం రాకుండా నిందితుడు సూట్‌కేస్‌లో దాచి తరలిస్తున్న మొత్తం 14 కేజీ గంజాయిని స్వాధీనిం చేసుకున్న పోలీసులు అతన్ని పీఎస్‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు్నారు.

టిప్‌టాప్‌గా రెడీ అయ్యాడు.. సూట్‌కేస్‌లతో బస్ ఎక్కాడు.. అనుమానం వచ్చి చెక్‌ చేయగా
Ganja Smuggling Jangaon

Edited By:

Updated on: Jun 02, 2026 | 4:27 PM

పైకి చూస్తే ఖరీదైన దుస్తులు.. చేతిలో రెండు బ్రాండెడ్ సూట్‌కేసులు.. ప్రయాణికులతో కలిసి ఆర్టీసీ బస్సులో ఎంతో క్లాస్‌గా ప్రయాణిస్తున్నాడు. అతడి హుందాతనాన్ని చూసి పక్కనున్న ప్రయాణికులు గానీ, ఆర్టీసీ సిబ్బంది గానీ కనీసం అనుమానం కూడా రాలేదు. కానీ, సీన్ కట్ చేస్తే సినిమా రేంజ్ ట్విస్ట్! ఆ సూట్‌కేసులు ఓపెన్ చేయగానే పోలీసులతో పాటు బస్సులో ఉన్నవారంతా ఒక్కసారిగా నోరెళ్లబెట్టారు. ఈ షాకింగ్ ఘటన జనగామ జిల్లాలో వెలుగుచూసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఈ హైడ్రామా చోటుచేసుకుంది. ఒక వ్యక్తి భారీగా గంజాయిని సూట్‌కేసులలో పెట్టుకుని ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సులో రవాణా చేస్తున్నాడనే నమ్మదగిన సమాచారం పోలీసులకు అందింది. దీంతో అప్రమత్తమైన బచ్చన్నపేట పోలీసులు వెంటనే బస్టాండ్ వద్దకు చేరుకొని సదరు ఎక్స్‌ప్రెస్ బస్సును అడ్డుకున్నారు. అనుమానితుడిగా ఉన్న ఆ క్లాస్ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకొని.. అతని వద్ద ఉన్న రెండు సూట్‌కేసులతో సహా అతన్ని కూడా కందకు దించారు.

తోటి ప్రయాణికులు అసలేం జరుగుతుందో తెలియక అయోమయానికి గురయ్యారు. తీరా పోలీసులు ఆ రెండు సూట్‌కేసులను ఓపెన్ చేయగా.. అందులో నుంచి గంజాయి ఘాటు గుప్పుమంది. స్మగ్లింగ్‌లో ఆరితేరిన ఆ నిందితుడు ఎవరికీ అనుమానం రాకుండా, బయటకు ఎలాంటి వాసన రాకుండా ఉండేందుకు ఎండు గంజాయిని ప్రత్యేక కవర్లతో అత్యంత పకడ్బందీగా ప్యాక్ చేశాడు. పుష్ప సినిమా రేంజ్ ఐడియా కాకపోయినా.. పోలీసుల కళ్లు గప్పేందుకు నిందితుడు వేసిన ప్లాన్ చూసి ఖాకీలే ఆశ్చర్యపోయారు. ఇక నిందితుడి సూట్‌కేసుల నుంచి పోలీసులు మొత్తం 14 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

ఈ గంజాయిని పొరుగు రాష్ట్రాల నుండి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు ప్రాథమిక పోలీసులు గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ముఠా వెనుక ఇంకా ఎంతమంది ఉన్నారు? ఈ గంజాయి నెట్‌వర్క్ ఎక్కడి నుండి ఎక్కడికి సాగుతోంది? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us