
ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న నిరుపేద కుటుంబాలకు ఊరటనిచ్చే ప్రకటన చేసింది. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులను ఆహ్వానించిందేకు సిద్ధమవుతోంది.
ఈ నెల 28వ తేదీ నుంచి దరఖాస్తులను ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. అర్హులైన వారు మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలుస్తోంది. అర్హుల ఎంపిక ప్రక్రియను క్షేత్ర స్థాయిలోనే చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. సంబంధిత డాక్యుమెంట్స్‌తో ప్రజలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో అప్లై చేసుకున్న తర్వాత వెరిఫికేషన్ కోసం గ్రామ సభలు, నగరాల్లో అయితే బస్తీ సభలను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. దీంతో అర్హులైన వారికి మాత్రమే రేషన్ కార్డులు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది, ఇందుకోసం ప్రత్యేకంగా నోడల్ అధికారులను నియమించనున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. రేషన్ సరకులతో పాటు ఆరోగ్య శ్రీ పథకానికి కూడా రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రేషన్ కార్డులు లేక పోవడంతో చాలా మంది పేదలు ప్రభుత్వ పథకాల లబ్ధి పొందలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ఎన్నికల ముందు అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చింది. తాజాగా ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా అడుగులు వేస్తోంది. ఇక రేషన్ కార్డుల్లో మార్పులు చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించనున్నట్లు సమాచారం.
పెళ్లైన మహిళలు ఒక కార్డులో నుంచి మరో కార్డులోకి మారడం, కొత్తగా చిన్నారుల పేర్లను కార్డులో చేర్చాలని ప్రతిపాదనలు వచ్చిన నేపథ్యంలో ఈ నెల 28వ తేదీ నుంచి వీరికి కూడా అవకాశం కల్పించనున్నట్లు సమాచారం. కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్న తరుణంలో ఇప్పటికే ఉన్న కార్డుల్లో కుటుంబ సభ్యుల్ని చేర్చేందుకు అనుమతివ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొత్తం 6,47,297 కొత్త రేషన్‌కార్డులు జారీచేసినట్లు అధికార గణంకాలు చెబుతున్నాయి. ఇక తెలంగాణలో ఇప్పటి వరకు మొత్తం 2.82 కోట్ల మందికి పైగా రేషన్ లబ్ధిదారులు ఉన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..