
GHMC Clay Ganesha Idols For Free: హైదరాబాద్‌లో గణేష్ ఉత్సవాలను పర్యావరణహితంగా నిర్వహించేందుకు GHMC కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది భక్తులకు లక్ష మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించింది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వినియోగాన్ని తగ్గించి.. చెరువులు, సరస్సులు, ఇతర నీటి వనరులను కాలుష్యం నుంచి కాపాడే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది.
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ‘ఎకో గణేశ్.. గ్రీన్ గణేశ్.. క్లే గణేశ్’ కార్యక్రమంలో భాగంగా ఈ విగ్రహాలను పంపిణీ చేయనున్నారు. GHMC పరిధిలోని సర్కిళ్లు, జోనల్ కార్యాలయాల ద్వారా సెప్టెంబర్ రెండో వారంలో మట్టి విగ్రహాలను అందుబాటులోకి తీసుకురానున్నారు. భక్తులతో పాటు కాలనీ సంక్షేమ సంఘాలు, గణేష్ మండపాల నిర్వాహకులు కూడా వీటిని పొందేందుకు అర్హులు.
మొత్తం లక్ష విగ్రహాలను మూడు పరిమాణాల్లో అందించనున్నారు. ఇందులో 70 వేల 8 అంగుళాల విగ్రహాలు, 20 వేల ఒక అడుగు విగ్రహాలు, 10 వేల 1.5 అడుగుల విగ్రహాలు ఉంటాయి. వీటి కొనుగోలుకు GHMC గరిష్ఠ ధరలను కూడా నిర్ణయించింది. 8 అంగుళాల విగ్రహానికి రూ.34.30, ఒక అడుగు విగ్రహానికి రూ.142, 1.5 అడుగుల విగ్రహానికి రూ.220 వరకు చెల్లించనుంది.
విగ్రహాల తయారీ, సరఫరా కోసం టెండర్ ప్రక్రియ ద్వారా ఏజెన్సీలను ఎంపిక చేయనున్నారు. ప్రతి కేటగిరీలో అత్యల్ప ధరను కోట్ చేసిన సంస్థకు అవకాశం ఇవ్వనున్నారు. ఎంపికైన సంస్థలు GHMC పరిధిలోని నిర్దేశిత ప్రాంతాలకు తమ సొంత ఖర్చుతో విగ్రహాలను తరలించాలి. గణేష్ ఉత్సవాలకు కనీసం వారం రోజుల ముందే విగ్రహాలను అందజేయాల్సి ఉంటుంది.
ఈసారి పంపిణీ చేసే విగ్రహాలను సహజ మట్టి, బయోడిగ్రేడబుల్ పదార్థాలతోనే తయారు చేయాలని GHMC స్పష్టం చేసింది. కృత్రిమ పదార్థాలు, కృత్రిమ రంగులు, బయోడిగ్రేడబుల్ కాని రసాయన రంగులు, ఆయిల్ పెయింట్ల వినియోగానికి అనుమతి ఉండదు.
గతేడాది ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని అధికారులు తెలిపారు. గణేష్ విగ్రహాల నిమజ్జనం సమయంలో నీటి వనరుల్లో కాలుష్యం పెరగకుండా చూడటంతో పాటు.. పర్యావరణహిత పద్ధతుల్లో పండుగను నిర్వహించేలా ప్రజలను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని GHMC అధికారులు చెబుతున్నారు.
మట్టి వినాయకుడిని ప్రతిష్ఠిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుతూ గణేష్ ఉత్సవాలను జరుపుకుందాం అనే సందేశాన్ని ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని GHMC భావిస్తోంది.