
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పుస్తకాల్లోని పాఠాలకే పరిమితం కాకుండా చరిత్ర, కళలు, వారసత్వ సంపదను ప్రత్యక్షంగా పరిచయం చేయాలనే ఉద్దేశంతో పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌లోని ప్రపంచ ప్రఖ్యాత సాలార్‌జంగ్ మ్యూజియాన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఉచితంగా సందర్శించే అవకాశాన్ని కల్పించింది. ఈ నిర్ణయం ద్వారా చిన్నారుల్లో చారిత్రక అవగాహన పెంపొందించడంతో పాటు భారతీయ సంస్కృతి, కళా వైభవంపై ఆసక్తిని పెంచాలని అధికారులు భావిస్తున్నారు. ఈ విషయాన్ని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ వెల్లడిస్తూ, రాష్ట్రంలోని అన్ని జిల్లాల జిల్లా డీఈవోలు ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలిపారు. జిల్లాల వారీగా విద్యార్థుల విద్యా విహారయాత్రలను ప్రణాళికాబద్ధంగా నిర్వహించి, ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరులోపు పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ ఉచిత ప్రవేశం కేవలం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకే పరిమితం కాదని, ప్రభుత్వం గుర్తింపు పొందిన ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని విద్యాశాఖ స్పష్టం చేసింది. అయితే విహారయాత్రల నిర్వహణలో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల విద్యార్థులకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా విద్యాశాఖాధికారులకు సూచించింది. మ్యూజియం సందర్శనకు వెళ్లే పాఠశాలలు తప్పనిసరిగా ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం పాఠశాల ప్రధానోపాధ్యాయులు లేదా యాజమాన్యాలు కనీసం 48 గంటల ముందు education.salarjungmuseum@gmail.comకు ఈ-మెయిల్ పంపి తమ సందర్శనను నమోదు చేసుకోవాలని అధికారులు తెలిపారు. ముందస్తు బుకింగ్ లేకుండా వెళ్లే పాఠశాలలకు ప్రవేశంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించారు.
విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ పలు నిబంధనలను కూడా విద్యాశాఖ అమలు చేయనుంది. ప్రతి 30 మంది విద్యార్థులకు కనీసం ఒక ఉపాధ్యాయుడు వెంట ఉండడం తప్పనిసరి. అలాగే విద్యార్థులను విహారయాత్రకు పంపే ముందు వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకుల నుంచి రాతపూర్వక సమ్మతి పత్రం తీసుకోవాలని స్పష్టం చేసింది. ప్రయాణ సమయంలో విద్యార్థుల భద్రత, క్రమశిక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని పాఠశాల యాజమాన్యాలకు సూచించింది. ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన సాలార్‌జంగ్ మ్యూజియంలో ఆసియా, ఐరోపా, దూర ప్రాచ్య దేశాలకు చెందిన అరుదైన కళాఖండాలు, ప్రాచీన నాణేలు, ఆయుధాలు, తివాచీలు, శిల్పాలు, హస్తకళా వస్తువులు, చిత్రాలు, చారిత్రక పురావస్తువులు వేల సంఖ్యలో భద్రపరిచి ఉన్నాయి. దేశ విదేశాల నుంచి ప్రతి ఏడాది లక్షలాది మంది సందర్శకులు ఈ మ్యూజియాన్ని సందర్శిస్తుంటారు.ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు తరగతి గదిలో చదివే చరిత్రను ప్రత్యక్షంగా చూసే అవకాశం లభించనుండగా, వారిలో కళలు, సంస్కృతి, వారసత్వ పరిరక్షణపై అవగాహన పెంపొందుతుందని విద్యాశాఖ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.