Khammam: ఖమ్మంలో రైతు బలవన్మరణం.. విచారణకు ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి..

ఖమ్మం జిల్లా చింతకాని మండలం ప్రొద్దుటూరులో విషాదం చోటు చేసుకుంది. తన భూమి కబ్జాకు గురైందని రైతు ప్రభాకర్‌ ఆత్మహత్య చేసుకున్నాడు.. అధికారులు పట్టించుకోలేదని సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు ప్రభాకర్‌. తన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకున్నాడు.

Khammam: ఖమ్మంలో రైతు బలవన్మరణం.. విచారణకు ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి..
Farmer Sucide
Follow us

|

Updated on: Jul 02, 2024 | 4:18 PM

ఖమ్మం జిల్లా చింతకాని మండలం ప్రొద్దుటూరులో విషాదం చోటు చేసుకుంది. తన భూమి కబ్జాకు గురైందని రైతు ప్రభాకర్‌ ఆత్మహత్య చేసుకున్నాడు.. అధికారులు పట్టించుకోలేదని సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు ప్రభాకర్‌. తన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకున్నాడు. ప్రొద్దుటూరు గ్రామానికి చెందిన భోజడ్ల వీరభద్ర, భోజడ్ల ప్రభాకర్‌రావుకి దాదాపు ఏడెకరాల భూమి ఉంది. సర్వేనెంబర్ 276, 277లో ఉన్న భూమి విషయంలోనే ఇప్పుడు వివాదం నెలకొంది. ఇందులో కొంత భూమిని ఇదే గ్రామానికి చెందిన నాయకులు, చెరువు సొసైటీ సభ్యులు కబ్జా చేశారనేది ఈ రైతు ప్రభాకర్‌ ఆవేదన. పొలంలో పొక్లెయిన్, JCBలతో గుంతలు తీసి మట్టిని కూడా తరలించేస్తున్నారంటూ కన్నీరు పెట్టారు. తన ఆవేదన మొత్తాన్ని సెల్ఫీ వీడియోగా తీసి.. తనకు చావే గతి అంటూ పురుగుల మందు తాగడం సంచలనంగా మారింది.

తన సమస్యను అనేకమార్లు రెవిన్యూ అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని, సోమవారం గ్రీవెన్స్‌లో కలెక్టర్‌కు అర్జీ ఇవ్వడానికి వస్తే అదీ కుదరలేదని ఆవేదన వ్యక్తం చేశారు రైతు ప్రభాకర్‌. తనకు మరో మార్గం లేదనే ఉద్దేశంతోనే పురుగుల మందు తాగినట్టు సెల్ఫీ వీడియోలో చెప్పారు. ఏడు ఎకరాల భూమిలో మూడు ఎకరాలు సర్వనాశనం అయిందని.. ఈ వీడియో ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు చేరాలని.. తన కుటుంబాన్ని ఆదుకోవాలంటూ రైతు వీడియోలో చెప్పడం చూపరులను కంటతడి పెట్టిస్తున్నది..

కాగా.. ప్రభాకర్‌ పురుగుల మందు తాగిన విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని.. అతన్ని ఆస్పత్రికి తరలించారు. అయితే.. అప్పటికే పరిస్థితి చెయ్యిదాటిపోయింది. మార్గమధ్యలోనే ప్రభాకర్ చనిపోయాడు.. దీంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

కాగా.. ఖమ్మంజిల్లాలో రైతు ఆత్మహత్యపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని ఆదేశించారు. కారకులపై చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశించారు. దీనిపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం విచారణకు ఆదేశించారు. నివేదిక అందించాలని అధికారులను కోరారు. రైతులు ఆత్మహత్య చేసుకోద్దంటూ సూచించారు.

కాంగ్రెస్ పై బీఆర్ఎస్ ఫైర్..

కాగా.. ఖమ్మం జిల్లాలో రైతు ఆత్మహత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.. రైతు ఆత్మహత్యపై కేటీఆర్, హరీష్‌ కాంగ్రెస్‌ను టార్గెట్‌ చేశారు. తెలంగాణలో రైతుల దుస్థితి ఇలా ఉందంటూ కేటీఆర్ ట్వీట్‌ చేశారు. ఇదీ కాంగ్రెస్‌ తెచ్చిన మార్పు అంటూ కేటీఆర్‌ విమర్శలు చేశారు. రైతు ప్రభాకర్‌ ఆత్మహత్యకు కాంగ్రెస్‌ప్రభుత్వమే కారణమని.. కాంగ్రెస్‌కు ఓటేసిన పాపానికి చనిపోతున్నానని ప్రభాకర్‌ చెప్పారంటూ హరీష్ రావు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పేరును ప్రస్తావిస్తూ రైతు ప్రభాకర్‌ ఆత్మహత్య చేసుకున్నాడని.. రైతు ఆత్మహత్యపై ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరం అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..