AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నకిలీ ULC లెటర్లతో సర్కార్ ఆస్తుల రిజిస్ట్రేషన్లు.. తీగలాగితే కదులుతున్న డొంక..!

మేడ్చల్ జిల్లాలో నకిలీ ULC క్లియరెన్స్‌ లేఖలతో ఆస్తుల రిజిస్ట్రేషన్ల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. జీడిమెట్ల ప్లాట్లకు నకిలీ పత్రాలు సృష్టించి రూ.6 లక్షలు వసూలు చేసి రిజిస్ట్రేషన్లు చేయించారు. ఈ కేసులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సహా ముగ్గురిని అరెస్ట్ చేసి, నకిలీ పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఆస్తి కొనుగోలుదారులు పత్రాల ప్రామాణికతను ధ్రువీకరించుకోవాలని పోలీసులు హెచ్చరించారు.

నకిలీ ULC లెటర్లతో సర్కార్ ఆస్తుల రిజిస్ట్రేషన్లు.. తీగలాగితే కదులుతున్న డొంక..!
Fake Ulc Documents
Balaraju Goud
|

Updated on: Oct 16, 2026 | 8:30 PM

Share

మేడ్చల్ జిల్లా: ప్రభుత్వ భూ పరిమితి విభాగం (ULC) పేరుతో నకిలీ క్లియరెన్స్‌ లేఖలు సృష్టించి ఆస్తుల రిజిస్ట్రేషన్లు చేయించిన వ్యవహారం మేడ్చల్‌ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. కుత్బుల్లాపూర్‌ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో నకిలీ పత్రాలను సమర్పించి రిజిస్ట్రేషన్లు చేయించిన కేసులో సూరారం పోలీసులు ముగ్గురిని అరెస్ట్‌ చేశారు. నిందితుల నుంచి 17 నకిలీ పత్రాలు, ఐదు రబ్బరు స్టాంపులు, ఐదు స్టాంప్‌ ప్యాడ్లు, గ్రీన్‌ పెన్‌, మూడు మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

జీడిమెట్ల ప్లాట్లకు నకిలీ క్లియరెన్స్‌ లేఖలు

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. జీడిమెట్ల గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 192, 193లో ఉన్న ప్లాట్లకు సంబంధించి ప్రభుత్వ అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్‌ (ULC) అధికారులు జారీ చేసినట్లుగా రెండు క్లియరెన్స్‌ లేఖలను కుత్బుల్లాపూర్‌ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో సమర్పించారు. అయితే, ఆ పత్రాల ప్రామాణికతపై పరిశీలన జరపగా, అవి సంబంధిత ప్రభుత్వ అధికారులు జారీ చేసిన అసలైన పత్రాలు కావని గుర్తించారు. ఈ నకిలీ క్లియరెన్స్‌ లేఖల ఆధారంగా ఈ ఏడాది జూన్‌ 4న రెండు సేల్‌ డీడ్ల రిజిస్ట్రేషన్లు జరిగినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. దీంతో ఈ వ్యవహారంపై అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రూ.6 లక్షలు తీసుకొని నకిలీ పత్రాలు సృష్టి!

ULC క్లియరెన్స్‌ పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆస్తి యజమానులకు పత్రాలు ఇప్పిస్తామంటూ నమ్మించి నకిలీ లేఖలు సృష్టించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ వ్యవహారంలో రూ.6 లక్షలు తీసుకుని నకిలీ ULC క్లియరెన్స్‌ పత్రాలను తయారు చేసి, రిజిస్ట్రేషన్లు పూర్తయ్యేలా చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రభుత్వ అధికారుల సంతకాలు, ముద్రలను అనుకరిస్తూ పత్రాలు రూపొందించినట్లు నిందితులపై ఆరోపణలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంలో పత్రాల తయారీ, వాటిని సమర్పించడం, లావాదేవీలను సమన్వయం చేయడం, డబ్బు వసూలు చేయడం వంటి అంశాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ముగ్గురు నిందితుల అరెస్ట్‌

ఈ కేసులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి జాదవ్‌ సుధాకర్‌ (39), నారాయణదాసు శివాచారి అలియాస్‌ శివ (57), రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి చిట్టిమిల్ల బలరాం (64)లను సూరారం పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుల నుంచి 17 పత్రాలు, ఐదు రబ్బరు స్టాంపులు, ఐదు స్టాంప్‌ ప్యాడ్లు, గ్రీన్‌ పెన్‌, మూడు మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కుత్బుల్లాపూర్‌ జూనియర్‌ సబ్‌రిజిస్ట్రార్‌-I పి. మధుబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సూరారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అరెస్టు చేసిన నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

ఆస్తుల కొనుగోలుదారులు అప్రమత్తం!

ఈ ఘటనతో స్థిరాస్తుల కొనుగోలు, విక్రయాల సమయంలో సమర్పించే ప్రభుత్వ క్లియరెన్స్‌ పత్రాల ప్రామాణికతను ధ్రువీకరించుకోవాల్సిన అవసరం మరోసారి స్పష్టమైంది. ముఖ్యంగా ULC క్లియరెన్స్‌ లేఖలు, ప్రభుత్వ అనుమతులు, ఇతర కీలక పత్రాలను సంబంధిత అధికారిక కార్యాలయాల ద్వారా పరిశీలించిన తర్వాతే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడం మంచిది. ప్రభుత్వ పత్రాల పేరుతో మోసాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తునర్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us