తస్సాదియ్యా.. కలెక్టర్‌నే బెదిరించిన ఇంటర్‌పోల్ అధికారులు! చివర్లో దిమ్మతిరిగే ట్విస్ట్

మెదక్ కలెక్టరేట్‌లో ఇద్దరు వ్యక్తులు తాము ఇంటర్‌పోల్ అధికారులమంటూ నకిలీ ఐడీ కార్డులతో కలెక్టర్‌ను కలిసేందుకు ప్రయత్నించారు. భూ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఒత్తిడి తెచ్చారు. అనుమానం వచ్చిన సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వగా, నిందితులు హైదరాబాద్‌కు చెందిన వారిగా తేలి అరెస్టయ్యారు.

తస్సాదియ్యా.. కలెక్టర్‌నే బెదిరించిన ఇంటర్‌పోల్ అధికారులు! చివర్లో దిమ్మతిరిగే ట్విస్ట్
Medak Collectorate Fake Interpol Officers

Edited By:

Updated on: Aug 04, 2026 | 7:07 PM

మెదక్ జిల్లా కలెక్టరేట్‌లో హైడ్రామా చోటుచేసుకుంది. నిన్న జరిగిన ప్రజావాణి వేదికగా ఇద్దరు కేటుగాళ్లు కలెక్టర్‌కే బురిడీ కొట్టించాలని చూశారు. తాము అంతర్జాతీయ పోలీసు సంస్థ ఇంటర్‌పోల్ అధికారులు అంటూ హల్‌చల్ చేశారు. తీరా కలెక్టర్ సిబ్బందికి అనుమానం వచ్చి పోలీసులకు అప్పగించడంతో వారి అసలు రంగు బయటపడింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మెదక్ జిల్లా కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం లాగానే ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి కార్యక్రమం ఏర్పాటు చేశారు.

దీనిలో సమస్యలు చెప్పుకోవడానికి ఎక్కడికక్కడి నుండో బాధితులు పెద్ద ఎత్తున్న వచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్‌కు కూడా పాల్గొన్నారు. సరిగ్గా అదే సమయంలో ఇద్దరు వ్యక్తులు దర్జాగా కలెక్టరేట్ లోపలికి ప్రవేశించారు. నేరుగా కలెక్టర్ టేబుల్ ముందుకు వెళ్లి, తాము ఇంటెలిజెన్స్, అంతర్జాతీయ విచారణ సంస్థ అయిన ఇంటర్‌పోల్ అధికారులు అంటూ ఐడీ కార్డులు తీసి కలెక్టర్‌ ప్రతిమ సింగ్ కి చూపించి, తమకు ఒక భూ సమస్య ఉందని, దాన్ని తక్షణమే పరిష్కరించాలంటూ అధికారులపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. వీరిపై అక్కడ ఉన్న అధికారులకి అనుమానం వచ్చింది.

అంతర్జాతీయ స్థాయి ఇంటర్‌పోల్ అధికారులమని చెప్పుకుంటూ ఒక సాధారణ భూ సమస్య కోసం కలెక్టరేట్‌కు రావడం ఏంటని అక్కడ ఉన్న కలెక్టర్ సీసీ సిబ్బందికి డౌట్ రావడంతో వారు చూపించిన ఐడెంటిటీ కార్డుల గమనించిన సిబ్బంది. అవి నకిలీవని గ్రహించారు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. కలెక్టరేట్ సిబ్బంది నుంచి సమాచారం అందిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. మెదక్ కలెక్టరేట్‌లోని ఆ ఇద్దరు నకిలీ అధికారులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల స్టైల్లో విచారించడంతో కేటుగాళ్ల గుట్టు రట్టయింది. హైదరాబాద్ కొత్తపేటకు చెందిన బుక్క సంతోష్, అతని స్నేహితుడు శ్రీనాథ్‌గా పోలీసులు గుర్తించారు. తమ వ్యక్తిగత భూ సమస్యను వేగంగా పరిష్కరించుకోవడానికి, అధికారులను భయపెట్టడానికే ఈ ఇంటర్‌పోల్ డ్రామా ఆడినట్లు నిందితులు ఒప్పుకున్నారు. నిందితుల నుంచి నకిలీ ఐడీ కార్డులను స్వాధీనం చేసుకున్న పోలీసులు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us