Telangana: సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం.. 3 రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవులు

|

Jul 10, 2022 | 4:16 PM

తెలంగాణ వ్యాప్తంగా కుండపోత వర్షం కురుస్తోంది. ఈ జిల్లా ఆ జిల్లా అని తేడా లేదు. అన్ని జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. గ్యాప్‌ లేకుండా వర్షం పడడంతో అన్ని పట్టణాలు తడిచి ముద్దయ్యాయి.

Telangana: సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం.. 3 రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవులు
Cm Kcr
Follow us on

Telangana Rains: మేఘాలు బద్ధలయ్యాయి. వరుణుడు విజృంభించాడు. తెలంగాణ వ్యాప్తంగా కుండపోత. ఈ జిల్లా ఆ జిల్లా అని తేడా లేదు. అన్ని జిల్లాల్లో వానలు ఉతికి ఆరేస్తున్నాయి. నాన్‌స్టాప్‌గా వాన పడుతోంది. అన్ని పట్టణాలు తడిచి ముద్దయ్యాయి. మూడు రోజులగా కురిసినవర్షంతో  జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో వందలాది ఎకరాలు నీట మునిగాయి. కాలు కూడా బయటపెట్టలేని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే తెలంగాణ సీఎం కేసీఆర్(CM KCR) కీలక నిర్ణయం తీసుకున్నారు. ముందు జాగ్రత్తగా సోమ, మంగళ, బుధవారాల్లో విద్యాసంస్థలకు(TS Schools) సెలవులు ప్రకటించారు. తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ(IMD) హెచ్చరించడంతో.. ముఖ్యమంత్రి ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. మంత్రులు, సీఎస్‌, ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించిన అనంతరం.. ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేశారు. వర్షాల పరిస్థితి, చేపట్టిన చర్యలు, తీసుకోవాల్సిన చర్యలపై సీఎం అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

కలెక్టర్లకు సీఎస్ కీలక ఆదేశాలు

భారీ వర్షాల నేపథ్యంలో సీఎం కేసీఆర్​ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ రివ్యూ నిర్వహించారు.  భారీ వర్షాల కారణంగా నెలకొన్న పరిస్థితులను సీఎస్ సమీక్షించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను CS ఆదేశించారు.

మూడు రోజులగా కురిసినవర్షంతో ఉమ్మడి వరంగల్‌ జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కాటారం వీరాపూర్‌ చెరువు కట్ట తెగింది. దీంతో వందలాది ఎకరాలు నీట మునిగాయి. ఇటు మేడారంకు రాకపోకలు బంద్ అయ్యాయి. జంపన్న వాగు నిండి ఉధృతంగా ప్రవహిస్తోంది. బ్రిడ్జిపై నుంచి వరద ప్రవహిస్తుండడంతో మేడారంకు రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు జీడీ వాగు కూడా ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఏటూరునాగారం-మంగపేట మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. భూపాలపల్లి జిల్లాల్లో ఎడతెరిపిలేని వర్షంతో గ్రామాల్లోకి వరద నీరు చేరుతోంది. భారీ వరదతో భూపాలపల్లిలోని జడ్పీ స్కూల్‌లోకి వరద నీరు చేరింది. స్కూలు చుట్టు పక్కల ప్రాంతాల్లోకి కూడా నీరు చేరింది.

భారీ వర్షాలతో మంథని ప్రాంతం అతలాకుతలమవుతోంది. కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో పంట పొలాలు మునిగాయి. మంథని పక్కనే ఉన్న బొక్కల వాగు, మానేరు వాగు గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో గోదావరి పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు,కుంటలు పొంగిపొర్లుతున్నాయి. వరద ప్రాంతాల్లో ఎమ్మెల్యే అజ్మీరా రేఖా నాయక్‌ పర్యటించారు. ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇటు భద్రాచలం దగ్గర గోదావరికి వరద భారీగా పెరుగుతోంది. రాత్రి 43 అడుగులకు నీటిమట్టం చేరుకుంటుందని అధికారుల అంచనా వేస్తున్నారు. దీంతో రాత్రికి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు సంక్షేమ హాస్టల్‌లో ఉన్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వరంగల్‌, హన్మకొండ జిల్లాలోని సంక్షేమ హాస్టల్‌ విద్యార్థులు చలికి వణికి పోతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ప్రభుత్వ చీఫ్‌ విప్‌ వినయ్‌ భాస్కర్‌ .. హన్మకొండలోని ఓ హాస్టల్స్‌ను సందర్శించారు.

ఇటు ఏపీలో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గోదారమ్మ ఉరకలేస్తోంది. ఇప్పటికే ధవళేశ్వరం దగ్గర నీటిమట్టం 13 అడుగులు దాటింది. 175 గేట్ల నుండి రెండులక్షలకు పైగా క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు.సీతానగరం మండలం బొబ్బిలంక,ములకల్లంక గ్రామాల మధ్య గోదావరి పొంగిపొర్లడంతో రెండు గ్రామాల మధ్య రాకపోకలు నిలిపివేశారు. ప్రకాశం బ్యారేజీ భారీగా వరద పెరిగింది. దీంతో 30 గేట్లు ఎత్తి 40 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.