
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. నీళ్లందక ఎండిన పంటలను పరిశీలించి రైతన్నల కన్నీళ్లను తుడిచి ధైర్యాన్ని నింపేందుకు ఇవాళ క్షేత్రస్థాయి పర్యటన కోసం బయలుదేరారు. కుటుంబ సభ్యులతో దట్టీ కట్టించుకొని, అభిమాన కార్యకర్తల నడుమ కేసీఆర్ బస్సు ఎక్కి బయలుదేరారు. అయితే నేరుగా జనగాం జిల్లా దేవరుప్పల దరావత్ తండాకు చేరుకోనున్నారు.
తొలుత ఉదయం 10.30 గంటలకు జనగామ జిల్లాలోని ధరావత్ తండాకు చేరుకుని ఎండిపోయిన పంట పొలాలను పరిశీలిస్తారు. ఉదయం 11.30 గంటలకు సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి, అర్వపల్లి, సూర్యాపేట రూరల్ మండలాల్లో పర్యటిస్తారు. మధ్యాహ్నం ఒంటిగంటకు సూర్యాపేట రూరల్ మండలం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.30 గంటలకు సూర్యాపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 2 గంటలకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భోజనం చేస్తారు.
మధ్యాహ్నం 3 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి నల్లగొండ జిల్లాకు బయలుదేరుతారు. సాయంత్రం 4.30 గంటలకు నిడమనూరు మండలానికి చేరుకుని అక్కడ ఎండిపోయిన పంటలను పరిశీలిస్తారు. సాయంత్రం 6 గంటలకు నిడమనూరు నుంచి బయలుదేరి తిరిగి ఎర్రవెల్లి వెళతారు. రోడ్డు మార్గంలో ప్రయాణించి రాత్రి 7 గంటలకు ఎర్రవెల్లి చేరుకుంటారు.