హైదరాబాద్ రాజ్‌భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలంటూ సీపీఐ నేతలు ఇచ్చిన రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమం మరింత ఆందోళనకరంగా మారింది. భారీ స్థాయిలో సీపీఐ నేతలు రాజ్‌భవన్ వద్దకు చేరుకున్నారు. దాంతో అలర్ట్ అయిన పోలీసులు రాజ్‌భవన్ దగ్గర భారీగా మోహరించారు. ఆందోళన చేపట్టిన సీపీఐ నేతలను అడ్డుకుని అరెస్ట్ చేశారు. ఖైరతాబాద్ సమీపంలో సీపీఐ నేతలను అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. దేశంలో గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ నేతలు రాజ్‌భవన్ ముట్టడికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ పులిపు మేరకు పార్టీ శ్రేణులు భారీ ఎత్తున రాజ్‌భవన్ ముట్టడికి తరలి వచ్చారు. అప్పటికే అలర్ట్ అయిన పోలీసు బలగాలు.. సీపీఐ నేతలను ఎక్కడికక్కడ నిలువరిస్తున్నారు. కొందరు రాజ్‌భవన్‌ను సమీపించినా.. వారిని అడ్డగించి అరెస్ట్ చేశారు పోలీసులు.
గత కొంతకాలంగా గవర్నర్ వ్యవస్థపై సీపీఐ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా ప్రయోజన కార్యక్రమాలను గవర్నర్లు అడ్డుకుంటున్నారంటూ ఆరోపిస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, రాజకీయ అజెండాలతో ప్రజా ప్రభుత్వాలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఇలాంటి గవర్నర్ వ్యవస్థ అవసరం లేదంటూ సీపీఐ నేతలు డిమాండ్ చేస్తున్నారు. రబ్బర్ స్టాంపు లాంటి గవర్నర్ వ్యవస్థను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు కమ్యూనిస్టులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..