Warangal: వరంగల్ పోలీస్ కమిషనర్‌కి పాలాభిషేకాలు.. కబ్జాదారుల నుంచి కాపాడారంటున్న బాధితులు

సిటీకి కమిషనర్లు వస్తుంటారు... పోతుంటారు... మేమిక్కడ లోకల్... అంటూ రెచ్చిపోయే గుంపు... ఇప్పుడు చప్పుడు చెయ్యకుండా గప్‌చుప్ ఐపోయింది. ఆడు మగాడ్రా బుజ్జీ అంటూ సదరు పోలీస్‌ కమిషనర్‌ మీద ప్రశంసలూ పడుతున్నాయ్. పాలాభిషేకాలూ జరుగుతున్నాయ్. ఎవరా కమిషనర్... ఏమా కథ?

Warangal: వరంగల్ పోలీస్ కమిషనర్‌కి పాలాభిషేకాలు.. కబ్జాదారుల నుంచి కాపాడారంటున్న బాధితులు
CP Ranganath

Updated on: Mar 31, 2023 | 7:48 PM

దండాలయ్యా దండాలయ్యా… మాతోనే నువ్వుండాలయ్యా.. అంటూ చేతులెత్తి మొక్కుతున్నారు వరంగల్ జనం. పోలీస్ కమిషనర్ ఏ.వీ రంగనాథ్ నిజంగానే బాధితుల పాలిట దేవుడయ్యారు. ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని భూకబ్జా కేసుల్ని పరిష్కరించిన కమిషనర్‌ పట్ల కృతజ్ఞతా భావంతో పాలాభిషేకం చేస్తున్నారు స్థానికులు. 2022 డిసెంబర్ ఒకటిన కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన రంగనాథ్.. ఈ నాలుగు నెలల్లో అందిన ఫిర్యాదుల్లో 90 శాతం పరిష్కరించారు. భూవివాదాల పరిష్కారం కోసం టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసి… బాధితులకు ఎక్కడికక్కడ రిలీఫ్‌నిచ్చారు. 14 డివిజన్ అధికార పార్టీ కార్పొరేటర్ భర్త తూర్పాటి సారయ్యతో పాటు మరో నలుగురిని అరెస్ట్ చేయడంతో ఆయా ప్రాంతాల్లో సంబరాలు చేసుకున్నారు. కబ్జాకు గురైన స్థలాల్లోనే సీపీ చిత్ర పటానికి పాలాభిషేకం చేసి, మిఠాయిలు పంచుకున్నారు.

గతంలో ఏ పోలీస్ అధికారిని కలిసినా న్యాయం జరగలేదని… సీపీ రంగనాథ్‌ను కలిసిన వారం రోజుల్లోపే తన భూమి తనకు దక్కిందని ఆనందంతో… కాశిబుగ్గ చౌరస్తాలో సీపీ చిత్రపటానికి పాలాభిషేకం చేశాడు సయ్యద్ అసద్ అనే ఈ దివ్యాంగుడు.

అటు… సీఎం కేసీఆర్ నుంచి, మిగతా మంత్రుల నుంచి కాంప్లిమెంట్స్ అందుకుంటున్నారు పోలీస్ కమిషనర్. ఎంతటివారైనా వెనక్కు తగ్గకుండా వరసబెట్టి అరెస్టు చేస్తూ, కబ్జాదారుల్లోనూ, వాళ్లకు వత్తాసు పలికే నాయకుల కంట్లో నలుసుగా మారారు సీపీ రంగనాథ్.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం