ఎమ్మెల్యే రసమయిని చూసి మంత్రి ఈటల నేర్చుకోవాలని కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క సూచించారు. హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ… రసమయికి ఉన్న బాధ్యత కూడా మీకు లేదా? అని ప్రశ్నించారు. పేరు మారింది తప్ప ఏమీ మారలేదని రసమయి చెప్పారన్నారు. ఎమ్మెల్యేకు ఉన్నంత ధైర్యం కూడా మంత్రులకు లేదా? అని భట్టి ప్రశ్నించారు. మంత్రులు తమ బాధ్యతలను నిర్వర్తించాలని.. తాబేదార్లుగా ఉండొద్దని సూచించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నతెలంగాణ, ప్రత్యేక తెలంగాణలో కొత్తగా సాధించేమీ లేదన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్నాం బ్రతకాలంటే..అన్ని శాఖలు పనిచేయాలన్నారు. ఏం సాధించారని ఆలయాలపై మీ చిత్రాలు చెక్కుకుంటున్నారని భట్టి నిలదీశారు. ఇది రాజరికమా? ప్రజాస్వామ్యామా? అని ప్రశ్నించారు. యాదాద్రి ఆలయ స్థంభాలపై కేసీఆర్ చిత్రం, టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన కారు గుర్తులా? అని భట్టి ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుల చిత్రాలు చెక్కండని భట్టి అన్నారు. డా. బాబా సాహేబ్ అంబేద్కర్, బూరుగుల నర్సింహారావు, పీవీ నర్సింహరావు వంటి ఎంతో మంది మహాత్ములున్నారని, వారి చిత్ర పటాలను ఆలయ గోడలపై చెక్కించాలని భట్టి సూచించారు.