Telangana: లక్కీ డ్రాలో సీఎం రేవంత్ రెడ్డికి గణపతి లడ్డు.. అవాక్కైన జనం.. అసలేం జరిగిందంటే..?

వినాయకుడి లక్కీ డ్రాలో ఎవరెవరికో బహుమతులు రావడం చూసుంటాం.. కానీ సాక్షాత్తు సీఎంకే లక్కీ డ్రా తగిలితే? వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.. సూర్యాపేటలో నిర్వహించిన గణపతి లక్కీ డ్రాలో సీఎం రేవంత్ రెడ్డి పేరు మీద ఏకంగా రూ.25 వేల నగదుతో పాటు 15 కేజీల లడ్డూ ప్రసాదం వరించింది. అసలు సీఎం పేరు మీద డ్రా ఎందుకు తీశారు? ఆ బహుమతి ఎవరికి దక్కిందో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..

Telangana: లక్కీ డ్రాలో సీఎం రేవంత్ రెడ్డికి గణపతి లడ్డు.. అవాక్కైన జనం.. అసలేం జరిగిందంటే..?
Cm Revanth Reddy Name Wins 15 Kg Laddu

Edited By:

Updated on: Sep 26, 2026 | 6:14 PM

వినాయక చవితి నవరాత్రుల వేడుకలు అంటేనే గల్లీగల్లీనా పూజలు, అన్నదానాలు, పోటాపోటీగా సాగే లడ్డూ వేలాలు, లక్కీ డ్రాలు సర్వసాధారణం. అయితే సూర్యాపేట పట్టణంలో నిర్వహించిన ఓ వినాయకుడి లక్కీ డ్రా మాత్రం అందరినీ తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసింది. సీఎం రేవంత్ రెడ్డి పేరు మీద ఏకంగా 15 కేజీల లడ్డూ ప్రసాదంతో పాటు రూ.25 వేల నగదు బహుమతి లభించడం స్థానికంగా విశేష చర్చనీయాంశంగా మారింది. సూర్యాపేట పట్టణంలోని చంద్రన్నకుంట కూడలిలో కాసం మణి యూత్ ఆధ్వర్యంలో వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా ఉత్సవ కమిటీ ఓ వినూత్న లక్కీ డ్రాను ఏర్పాటు చేసింది. కేవలం రూ.151 కూపన్ ధరతో రూ.25 వేల నగదు బహుమతి, 15 కేజీల లడ్డూ ప్రసాదాన్ని బహుమతులుగా ప్రకటించింది. దీంతో స్థానికులు పెద్ద ఎత్తున ఈ డ్రాలో పాల్గొన్నారు. ఇదే క్రమంలో చంద్రన్నకుంటకు చెందిన తోనుకునూరు సాయి కుమార్ అనే యువకుడు సీఎం రేవంత్ రెడ్డిపై ఉన్న వీరాభిమానంతో తన సొంత పేరు రాయకుండా.. రేవంత్ రెడ్డి పేరుతో కూపన్ కొనుగోలు చేసి డ్రా బాక్స్‌లో వేశాడు.

చీటీ తీయగానే ఒక్కసారిగా షాక్

నిమజ్జనం రోజున స్థానికుల సమక్షంలో లక్కీ డ్రా నిర్వహించారు. బహుమతి చీటీని తీసి చూడగా.. అందులో రేవంత్ రెడ్డి అని ఉండటంతో నిర్వాహకులు, అక్కడున్న స్థానికులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. అనంతరం అసలు విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయారు. తన అభిమాన నేత పేరు మీదనే బంపర్ డ్రా తగలడంతో సాయి కుమార్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

నగదును తిరిగి విరాళంగా..

అభిమాన నాయకుడి పేరిట వచ్చిన బహుమతిలో సాయి కుమార్ తన ఔదార్యాన్ని చాటుకున్నాడు. రూ.25 వేల నగదు బహుమతిని తను తీసుకోకుండా తిరిగి గణేష్ ఉత్సవ కమిటీకే విరాళంగా అందజేశాడు. స్వామివారి పవిత్ర ప్రసాదమైన 15 కేజీల లడ్డూను మాత్రం భక్తిశ్రద్ధలతో స్వీకరించాడు. వినాయకుని కృప, అభిమాన నేత పేరు కలిసి రావడంతో చోటుచేసుకున్న ఈ అరుదైన ఘటన ప్రస్తుతం సూర్యాపేట పట్టణంతో పాటు సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతోంది.

Loading...
Unable to load recommendations.
Follow Us