ప్రధాని నరేంద్ర మోదీని ఇవాళ స్వయంగా కలిసి సమతామూర్తి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి హాజరుకావాలని ఆహ్వానించారు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్‌స్వామి.. మైహోం గ్రూపు అధినేత జూపల్లి రామేశ్వర్‌రావు, శ్రీనివాసరామానుజంతో కలిసి ప్రధానిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు చిన్నజీయర్ స్వామి.
హైదరాబాద్ శివారు శంషాబాద్‌లోని ముచ్చింతల్ శ్రీరామనగరంలో 2022 ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు భగవద్రామానుజుల సహస్రాబ్ది వేడుకలు అంగరంగ వైభవంగా జరగబోతున్నాయి. 200 ఎకరాల్లో వేయి కోట్లతో భగవద్రామానుజుల 216 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు.
ఈ మహోత్సవ ఘట్టానికి దేశంలోని పలువురు ప్రముఖులను స్వయంగా అహ్వానిస్తున్నారు చినజీయర్ స్వామి. ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్రమంత్రులకు ఆహ్వాన పత్రికలు అందాయి. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకి కూడా ఆహ్వానం అందింది. నిన్న భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి రమణను కలిసి చిన్నజీయర్ స్వామి ఆహ్వానపత్రం అందించిన సంగతి తెలిసిందే.
కాగా, ఈ కార్యక్రమానికి తప్పకుండా హాజరవుతామని చినజీయర్‌స్వామికి కేంద్రమంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్ హామీ ఇచ్చారు. 'స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ'కి నిలువెత్తు నిదర్శనమైన సమతామూర్తి విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవ కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతాయి. ఇందులో భాగంగా 1 వెయ్యి 35 హోమ గుండాలతో ప్రత్యేక యాగం నిర్వహించనున్నారు.