Amit Shah: కేంద్ర మంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన ఖరారైంది. సెప్టెంబర్ 17న కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే విమోచన అమృతోత్సవ్ వేడుకల్లో పాల్గొనేందుకు షా హైదరాబాద్ వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా షా టూర్‌కి సంబంధించి పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఒకరోజు ముందే అంటే సెప్టెంబర్ 16వ తేదీనే షా హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. శుక్రవారం రాత్రి 9.50 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్న షా.. రాత్రి అకాడమీలో బస చేస్తారు. అనంతరం సెప్టెంబర్ 17వ తేదీ ఉదయం 8.45 గంటల నుంచి 11.45 గంటల వరకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేయనున్న విమోచన అమృతోత్సవ్ వేడుకల్లో పాల్గొంటారు.
విమోచన దినోత్సవం సందర్భంగా అమిత్ షా జాతీయ జెండా ఎగురవేస్తారు. అనంతరం భాజపా రాష్ట్ర కోర్ కమిటీతో అమిత్ షా సమావేశం నిర్వహించనున్నారు. బేగంపేట టూరిజం ప్లాజాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. తర్వాత మధ్యాహ్నం 2.30 గంటలకు సికింద్రాబాద్ క్లాసిక్ గార్డెన్స్‌కు చేరుకోనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో నిర్వహించనున్న కార్యక్రమంలో పాల్గొననున్న షా.. వికాలాంగులకు ఉచిత వాహనాలను అందించనున్నారు. అనంతరం సాయంత్రం తిరిగి రాజేంద్ర నగర్ పోలీస్ అకాడమీకి చేరుకుని పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. చివరిగా రాత్రి 7.30 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఢిల్లీకి భయలుదేరి వెళ్లనున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..