BRS on Congress: బీజేపీ ఆదేశాల మేరకే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోంది.. బీఆర్ఎస్ నేతల సంచలన ఆరోపణలు

| Edited By: Balaraju Goud

Jan 18, 2024 | 8:40 PM

కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు మండిపడ్డారు. భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు కాంగ్రెస్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అదానీతో కలిసి పనిచేస్తోందని మాజీ మంత్రులు, హరీష్ రావు, కేటీఆర్ ఆరోపించారు. మెడలు వంచుతామని చెప్పిన కాంగ్రెస్ నేతలు, బీజేపీ కేంద్ర మంత్రుల మెడలో పూలదండలు వేస్తున్నారని ఎద్దేవా చేశారు.

BRS on Congress:  బీజేపీ ఆదేశాల మేరకే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోంది.. బీఆర్ఎస్ నేతల సంచలన ఆరోపణలు
Harish Rao Ktr
Follow us on

ఇటీవల ముగిసిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై గజ్వేల్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ కృతజ్ఞత సభలో మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. గజ్వేల్‌లో కేసీఆర్‌ను ఓడించేందుకు రెండు జాతీయ పార్టీలు పని చేశాయన్నారు. కులాలు, మతాల పేరుతో చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఎన్ని కుట్రలు చేసినా కేసీఆర్ 45 వేల మెజారిటీతో గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు గెలిపించారన్నారు మాజీ మంత్రి. కేసీఆర్‌కు హ్యాట్రిక్ విజయాన్ని అందించారని, గజ్వేల్ ప్రజలందరికీ కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ తరుపున హరీష్ రావు ధన్యవాదాలు తెలిపారు.

కేటీఆర్ దావోస్ వెళ్లి పెట్టుబడులు తెస్తే దండుగ అన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి.. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి ఎందుకు వెళ్ళరో సమాధానం చెప్పాలని హరీష్ రావు నిలదీశారు. బీజేపీతో కోట్లాడతమని, దోస్తీ చేస్తున్నది ఎవరు అని ప్రశ్నించారు. బీజేపీ నేతలు బండి సంజయ్, అరవింద్, ఈటల రాజేందర్, రఘునందన్ ను ఓడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ అని గుర్తు చేశారు. ఈ దేశం ఆదానీ అంబానీ చేతుల్లో ఉందని, ఆదాని అవినీతి వెనుక ప్రధాని ఉన్నడని, ఈ ఇద్దరి చేతుల్లో 500 కంపెనీలు ఉన్నయని రాహుల్ గాంధీ అంటడని, రేవంత్ రెడ్డి మాత్రం ఆదానిని కలిసి హగ్, షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటరని దుయ్యబట్టారు. ఈ విషయంలో రాహుల్ కరెక్టా, రేవంత్ కరెక్ట అని అర్థం కావడం లేదన్నారు..

పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వబోమంటున్న బీజేపీపై కాంగ్రెస్ ఎందుకు కొట్లాడం లేదన్నారు. మెడలు వంచుతామని చెప్పిన కాంగ్రెస్ నేతలు, బీజేపీ కేంద్ర మంత్రుల మెడలో పూలదండలు వేస్తున్నారని ఎద్దేవా చేశారు. దీన్ని బట్టే ఎవరు ఎవరితో కుమ్మక్కయ్యారో తెలంగాణ ప్రజలకు స్పష్టంగా అర్థమవుతున్నదన్నారు హరీష్ రావు.

గజ్వేల్ ప్రజల కోసం నా తలుపులు 24 గంటల పాటు తెరిచే ఉంటాయని, ఎవరికి ఏ కష్టం వచ్చినా ఎప్పుడైనా నా వద్దకు రావచ్చు అన్నారు హరీష్ రావు. కంటికి రెప్పలాగా మిమ్మల్ని కాపాడుకుంటానన్నారు. కేసీఆర్ హయాంలో గజ్వేల్ అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందని గుర్తు చేశారు. కేసీఆర్ వచ్చాక తాగు, సాగు నీటి సమస్య లేదన్న ఆయన, కేసులు తగ్గి, కుట్రలు తగ్గాయన్నారు. గత చరిత్రను తిరగ రాసింది బీఆర్ఎస్ అన్నారు. ఒక్కనాడు కాంగ్రెస్ నాయకులపై కేసు పెట్టలేదు అన్నారు. కేసీఆర్ ఎప్పుడు గజ్వేల్ ఎలా బాగు చేయాలి అని నిరంతరం ఆలోచించారన్నారు. కానీ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి నెల రోజుకు కాలేదు. బెదిరింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కేసులు పెడుతున్నరని ఆరోపించారు.

కేసీఆర్ గజ్వేల్ ను అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తే, కాంగ్రెస్ నేతలు కేసులు, కుట్రలతో ముందుకు తీసుకెళుతున్నారు. డిసెంబర్ 9 న రుణమాఫీ అన్నారు. 4 వేలకు పించన్లు పెంచుతామన్నారు. కరెంట్ బిల్లు కట్టొద్దు అన్నారు. రైతు బంధు పెంచుతాం అన్నారు. వడ్లకు 500 బోనస్ అన్నారు. నిరుద్యోగ భృతి అన్నారు..ఇప్పుడు చేతులు ఎత్తేస్తున్నరని విమర్శించారు హరీష్ రావు. గజ్వేల్ లో కేసీఆర్ మంజూరు చేసిన పనులను ఆపడం ఇదెక్కడి పద్ధతి అని ప్రశ్నించారు. గజ్వేల్లో కేసీఆర్ మంజూరు చేసిన పనులు ఆపితే, ప్రజలు తిరగబడతారు జాగ్రత్త అని హెచ్చరించారు హరీష్ రావు.

కేసీఆర్ కోలుకుంటున్నారు. త్వరలోనే గజ్వేల్ క్యాంప్ ఆఫీస్ కి వస్తారని హరీష్ రావు తెలిపారు. అందరితో త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లో పూర్తిస్థాయిలో సహకారం ఉంటుందన్న హరీష్.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు మనకు అద్భుతమైన విజయమందిస్తారని ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటకలో ఇచ్చిన హామీలను అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం లేదు. వచ్చే ఎంపీ ఎన్నికల్లో మూడు వంతుల ఎంపీ సీట్లు అక్కడ కాంగ్రెస్ ఓడిపోతుందని హరీష్ రావు జోస్యం చెప్పారు. ఎంపీ ఎన్నికల్లో కలిసి పని చేద్దామని అద్భుత విజయం సాధిస్తామన్నారు. నీళ్లు పల్లమెరుగు అంటే నీళ్లను మీదికి ఎక్కించి చూపించింది కేసీఆర్ అన్న హరీష్ రావు.. ఎండాకాలంలో మత్తల్లు దూకేలా చేసింది కేసీఆర్ అని గుర్తు చేశారు. కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ కాలువల్లో నీళ్లు విడుదల చేయాలని గజ్వేల్ నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు హరీష్ రావు.

సీఎం రేవంత్ దావోస్ టూర్‌పై కేటీఆర్ ఫైర్

మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు మండిపడ్డారు. భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు కాంగ్రెస్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అదానీతో కలిసి పనిచేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. జనవరి 18, గురువారం తెలంగాణ భవన్‌లో జరిగిన మహబూబ్‌నగర్ జిల్లా బీఆర్‌ఎస్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఢిల్లీలో అదానీతో పోరాడుతున్న కాంగ్రెస్ తెలంగాణలో ఎందుకు కలిసి పని చేస్తోంది? అని ప్రశ్నించారు. మోదీ, అదానీ ఒక్కటేనని రాహుల్ గాంధీ అన్నారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ జాతీయ సమావేశంలో మోదీ, అదానీ ఒక్కటే అన్నారు. తాజాగా దావోస్‌లో అదానీతో హబ్‌నాబ్ చేస్తున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఇది అవకాశవాద, నీచ స్థాయి రాజకీయమని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత అదానీ పట్ల కాంగ్రెస్ వైఖరిలో మార్పు ఏంటని కేటీఆర్ ప్రశ్నించారు. అదానీ గ్రూప్ రాష్ట్రంలో బహుళ వ్యాపారాలలో రూ.12400 కోట్ల పెట్టుబడులను ప్రకటించిన ఒక రోజు తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…