
బిహార్ నుంచి తక్కువ ధరకు అక్రమ తుపాకులను కొనుగోలు చేసి హైదరాబాద్‌లో అధిక ధరకు విక్రయించడానికి యత్నించిన అంతర్‌రాష్ట్ర నేరస్థుడిని మల్కాజిగిరి ఎస్‌వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తర ప్రదేశ్‌లోని ఘాజిపుర్ జిల్లాకు చెందిన పర్బన్ కుమార్ ఉపాధి నిమిత్తం 2021లో హైదరాబాద్‌కు వచ్చి చర్లపల్లి పారిశ్రామిక ప్రాంతంలో నివాసముంటూ పనులు చేసుకునేవాడు. అయితే, ఈజీ మనీకి అలవాటు పడిన పర్బన్ కుమార్ గంజాయి విక్రయాలు ప్రారంభించాడు. గంజాయి చాక్లెట్లు విక్రయిస్తుండగా 2024లో చర్లపల్లి పోలీసులు అతనిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. జైలు నుంచి విడుదలయ్యాక తన నివాసాన్ని పటాన్‌చెరులోని బిహార్ బస్తీకి మార్చాడు.
త్వరగా ఎక్కువ మొత్తం సంపాదించాలనే ఆలోచనతో బిహార్‌లో తక్కువ ధరకు లభించే దేశవాళీ తుపాకులను హైదరాబాద్ తెచ్చి విక్రయించాలని ప్లాన్ చేశాడు. పాత పరిచయస్తుల సమాచారంతో ఈ నెల 10న బిహార్ వెళ్లిన పర్బన్, అక్కడ సోనూ అనే డీలర్ నుండి ఒక్కో తుపాకీకి రూ.30,000 చొప్పున చెల్లించి రెండు దేశవాళీ తుపాకులు, ఒక తపంచా, 19 సజీవ తూటాలను కొనుగోలు చేశాడు.
కొనుగోలు చేసిన ఆయుధాలతో ఈ నెల 22న హైదరాబాద్ చేరుకున్న నిందితుడు, బొల్లారంలోని సాధనా మందిర్ సమీపంలో కొనుగోలుదారుల కోసం వేచి చూస్తుండగా మల్కాజిగిరి ఎస్‌వోటీ ఇన్‌స్పెక్టర్ జానయ్య బృందం పక్కా సమాచారంతో దాడి చేసింది. అనుమానాస్పదంగా తిరుగుతున్న పర్బన్ కుమార్‌ను అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా ఆయుధాలు లభ్యమయ్యాయి. నిందితుడిపై ఆయుధ చట్టం కింద కేసు నమోదు చేసి బొల్లారం పోలీసులకు అప్పగించి శనివారం రిమాండ్‌కు తరలించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..